Rajouri Encounter: మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జవాన్.. కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో వీరమరణం..
తమ కుటుంబాన్ని, పిల్లలని వదిలి..సంతోషాన్ని సరదాలను విడిచి.. మంచు గడ్డలలో.. నిప్పుల కొలిమిలా ఉండే ఎడారిలో.. క్రూర మృగాలతో కాకులు దూరని చిట్టడవుల్లో.. నేల..నింగి..నీరులో పోరాడుతూ.. సరిహద్దులలోన నిలిచిన సైనికులు ప్రాణాలకు తెగించి.. మనల్ని నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే హఠాత్తుగా ఉగ్రవాదులు చేసే దాడిలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడి.. ప్రాణాలని విడిచి.. మరణానికి కూడా అర్ధాన్ని చెప్పి ఆనందించే వీరుడు భారత జవాన్.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన సచిన్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. జవాన్ మరణ వార్తలతో అతని గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వీరమరణం పొందిన జవానుకు డిసెంబర్ 8న వివాహం జరగనుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సైనికుడు ఉగ్రవాదులతో పోరాడుతూ.. వీరమరణం పొందిన సైనికుడు సచిన్. దేశసేవలో ప్రాణత్యాగం చేశాడు. వాస్తవానికి 24 ఏళ్ల సచిన్ పెళ్లి కోసం ఇప్పటికే సెలవులను అప్లై చేశాడు. త్వరలో సెలవులపై ఇంటికి వెళ్లాల్సిన సచిన్.. ఇప్పుడు పార్దీవ దేహంగా ఇంటికి చేరుకోనున్నాడు.
అమరవీరుడైన సచిన్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం సచిన్ మృతదేహం కోసం వేచి చూస్తున్నారు. స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు ఇవ్వనున్నారు. వీరమరణం పొందిన సైనికుడు సచిన్ అలీఘర్‌లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగరియ గొర్ల గ్రామ నివాసి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ కలాకోట్‌లోని బాజిమాల్‌లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో ఒక జవాన్ సచిన్.
సచిన్ అన్నయ్య కూడా భారత నౌకాదళంలో దేశానికి సేవలందిస్తున్నాడు. సచిన్ 2019 మార్చి 20న ఆర్మీలో చేరాడు. అనంతరం స్పెషల్ ఫోర్స్‌లో కమాండో అయ్యాడు. ప్రస్తుతం సచిన్ రాజౌరిలోని పారా II రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మథురలోని మాట్ పోలీస్ స్టేషన్ ప్రాంత నివాసి అయిన ఒక అమ్మాయితో సచిన్ వివాహం నిశ్చయించారు. నిశ్చితార్ధం అనంతరం డిసెంబర్ 8వ తేదీన వివాహ తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు కూడా.
రాజౌరిలో ఎన్‌కౌంటర్‌కు ముందు సచిన్ తన అన్నయ్యతో ఫోన్‌లో మాట్లాడాడు. సోదరుడు వివేక్‌తో మాట్లాడుతున్నప్పుడు అంతా బాగానే ఉందని సచిన్ చెప్పాడు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఆపరేషన్ గురించి కూడా సచిన్ తన అన్నకు చెప్పాడు. ఈ సంభాషణ తర్వాత కొన్ని గంటల తర్వాత సీనియర్ ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సచిన్ మరణ వార్తను తెలియజేశారు.
సచిన్ తండ్రి రమేష్ చంద్ర రైతు. కొడుకు సచిన్ మృతి వార్త విని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సచిన్ తల్లి భగవతీ దేవి బాధతో విలపిస్తోంది. ప్రస్తుతం సచిన్ భౌతికకాయాన్ని త్రివర్ణ పతాకంతో గౌరవించనున్నారు. స్వగ్రామానికి తీసుకొచ్చి అనంతరం సచిన్ పార్దీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








