School Roof collapse: ఘోర విషాదం.. స్కూల్ పైకప్పు కూలి ఏడుగురు విద్యార్థులు మృతి.. 15 మందికి గాయాలు..
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ పైకప్పు కూలి ఏడుగురు విద్యార్థులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ సహా సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

చదువుకోవడానికి స్కూల్ వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం తమ బిడ్డలు ఆడుతూ పాడుతూ వస్తారనుకున్న తల్లిదండ్రులు విగతజీవులుగా మిగలడం చూసి తల్లడిల్లిపోయారు. అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ బోరున విలపించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో జరిగింది. పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మరణించగా, 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్కూల్ బిల్డింగ్ 20ఏళ్ల నాటిది కావడంతో శిథిలావస్థకు చేరి పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. బాధితులు 12 నుంచి 14 ఏళ్ల వయస్సు గల 7వ తరగతి విద్యార్థులు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతికి సంతాపం తెలిపారు. ‘‘రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో పాఠశాల పైకప్పు కూలి ఏడుగురు విద్యార్థులు మరణించడం విచారకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారు.’’ అని మోడీ ట్వీట్ చేశారు. సీఎం భజన్‌లాల్ శర్మ దీనిని హృదయ విదారకమైన సంఘటనగా అభివర్ణించారు. గాయపడిన పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని మంత్రి మదన్ దిలావర్ తెలిపారు.
VIDEO | Jhalawar, Rajasthan: Roof of Piplodi Primary School collapses, several children feared trapped. Rescue operations underway.#RajasthanNews #Jhalawar
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/K0STKQwP0A
— Press Trust of India (@PTI_News) July 25, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
