Rahul Gandhi: వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రాహుల్ ప్లాన్ ఇదేనా..మళ్లీ అధ్యక్ష బాధ్యతలు యువనేతకేనా..?

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Aug 18, 2022 | 12:59 PM

దేశ రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత కాంగ్రెస్  పార్టీ నాయక‌త్వ లేమితో కొట్టిమిట్టాడుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షా నాయ‌క‌త్వంలో  బీజేపీ పార్టీ ప్రభుత్వ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మిస్తూ..

Rahul Gandhi: వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రాహుల్ ప్లాన్ ఇదేనా..మళ్లీ అధ్యక్ష బాధ్యతలు యువనేతకేనా..?
Rahul Gandhi

Rahul Gandhi: దేశ రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత కాంగ్రెస్  పార్టీ నాయక‌త్వ లేమితో కొట్టిమిట్టాడుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షా నాయ‌క‌త్వంలో  బీజేపీ పార్టీ ప్రభుత్వ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మిస్తూ.. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా విజ‌యం దుదుంబి మోగిస్తూ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తోంది. 2019 ఎన్నిక‌ల్లో అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నిక‌లు ఎదుర్కొన్న‌ప్ప‌టికి ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేదు. దీంతో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన త‌ర్వాత‌.. పార్టీకి పూర్తిస్థాయి అధ్యకుడిని నియ‌మించుకోలేక‌పోయింది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాదికి పైగా స‌మ‌యం ఉన్న‌ప్పటికి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టినుంచి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈఏడాది కాలంలో సొంత‌గా బ‌ల‌ప‌డి వీలైన‌న్ని ఎక్కువ లోక్ స‌భ స్థానాలు గెల్చుకుంటే.. ఆత‌ర్వాత యూపీఏ తో క‌లిసొచ్చే ప‌క్షాల‌ను క‌లుపుకుని ముందుకెళ్లాల‌నే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ అధిష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈలోగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కేంద్ర‌ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలను.. వివ‌రించేందుకు సెప్టెంబ‌ర్ 7వ తేదీన క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.

ఈయాత్ర ప్రారంభానికి ముందు బీజేపీ సిద్ధాంతాల‌కు, కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న మేధావులంద‌రిని క‌లిసి కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తాము చేసే పోరాటాన్ని వివ‌రిస్తూ.. మేధావుల మ‌ద్ద‌తు కూట‌గ‌ట్టేందుకు ఈనెల 22వ తేదీన ఢిల్లీలో పౌర స‌మాజంలోని ప్ర‌ముఖులు, ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌తో రాహుల్ గాంధీ స‌మావేశం అవుతారు. ఈస‌మావేశంలో భార‌త్ జోడో యాత్ర ఉద్దేశాల‌ను వివ‌రించి.. కేంద్ర‌ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన కార్య‌చ‌ర‌ణ‌పై వారి అభిప్రాయాల‌ను తెలుసుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఢిల్లీలో ఈనెల 22వ తేదీన నిర్వ‌హించే స‌మావేశంపై ఇప్ప‌టికే యోగేంద్ర‌యాద‌వ్, మేధా పాట్క‌ర్ వంటి ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌తో కాంగ్రెస్ నేత‌లు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

2014 కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు అప్ప‌టి బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రించిన వ్యూహాన్నే దాదాపుగా ఫాలో అవ్వాల‌ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఆర్ ఎస్ ఎస్ తో పాటు అనుబంధ సంస్థ‌ల ద్వారా 2014కు ముందు యూత్ ఎగైనెస్ట్ క‌ర‌ప్ష‌న్ (YAC) పేరుతో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఉద్య‌మాన్ని న‌డిపించారు. ఈఉద్య‌మం ద్వారా యూపీఏ ప్ర‌భుత్వంపై అవినీతి ప్ర‌చారాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌గ‌లిగారు. సామాజిక ఉద్య‌మ‌కారులు అన్నా హ‌జారే, మాజీ ఐపీఎస్ అధికారిణి కిర‌ణ్ బేడీ, శాంతి భూష‌ణ్, ప్ర‌శాంత్ భూష‌ణ్, కుమార్ విశ్వాస్, బాబా రాందేవ్ తో పాటు మ‌రికొంత‌మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్ లు యూపీఏ ప్ర‌భుత్వ అవినీతికి వ్య‌తిరేకంగా త‌మ గ‌ళాన్ని వినిపించ‌డంతో ఇది ప్ర‌జ‌ల్లోకి వేగంగా వెళ్ల‌గ‌లిగింది. ఇదే త‌ర‌హాలో కాంగ్రెస్ కూడా మేధావుల ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. భార‌త్ జోడో యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లో ఉంటూ.. త‌మ పార్టీ బ‌లాన్ని పెంచుకునేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగ‌బోతున్నారు. భార‌త్ జోడో యాత్ర కోసం ప్ర‌త్యేక లోగో, వెబ్ సైట్ తో పాటు క‌ర‌ప‌త్రాలు, ప్ర‌చార సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఆగ‌ష్టు 23వ తేదీన ఢిల్లీలో నిర్వ‌హించే స‌మావేశంలో భార‌త్ జోడో యాత్ర ప్ర‌త్యేక లోగోను ఆవిష్క‌రించే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉండ‌గా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ రికార్డు స్థాయిలో విజ‌యం సాధిస్తుంద‌ని.. 350 సీట్ల మార్కును చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆయ‌న ఓ వార్తా సంస్థ‌తో మాట్లాడుతూ.. దేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పాపులారిటి క్ర‌మంగా పెరుగుతోంద‌ని, వ్య‌తిరేక‌త లేద‌ని తెలిపారు. న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి గెలిపించాల‌ని ప్ర‌జ‌లు కృత‌నిశ్చ‌యంతో ఉన్నార‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. 282 లోక్ స‌భ స్థానాల నుంచి 2019లో 314 స్థానాల‌కు పెరిగామ‌ని.. ఈసారి టార్గెట్ 350ని చేరుకుంటామ‌న్నారు. బీహార్ లో సొంతంగా 35 లోక్ స‌భ స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు పేర్కొన్నారు. అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌డం ద్వారా భార‌త రాజ‌కీయాల్లో స‌రికొత్త రికార్డు సృష్టిస్తామ‌ని గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ వ్యాఖ్యానించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలోని అవ‌కాశం ఉన్న రాష్ట్రాల్లో పార్టీని విస్త‌రించ‌డం ద్వారా కాంగ్రెస్ కు ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బీజేపీకి గ‌ట్టి పోటీదారుడిగా నిల‌వాల‌నే ఆలోచ‌న‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఈఏడాది చివ‌రిలో జ‌రిగే గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నికల్లో స‌త్తా చాట‌డం ద్వారా దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే ప్లాన్ లో ఉన్న‌ట్లు రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద 2024 ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు ఎవ‌రి వ్యూహాల‌ను వారు ర‌చించే ప‌నిలో ప‌డ్డారు.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu