AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jitni Abadi-Utna Haq: రాహుల్ నినాదం.. జాతీయ రాజకీయాల్లో దుమ్ముదుమారం.. ఇది నిప్పుతో చెలగాటమే..!

Kiren Rijiju on Rahul Gandhi: జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. 'జిత్నీ ఆబాదీ - ఉత్నా హక్' అంటూ రాహుల్ గాంధీ అందుకున్న నినాదం అర్థం కూడా అదే. ఎంత జనసంఖ్య ఉంటే అంత హక్కు లభించాలి అన్నది ఆయన మాటల అర్థం. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తోంది.

Jitni Abadi-Utna Haq: రాహుల్ నినాదం.. జాతీయ రాజకీయాల్లో దుమ్ముదుమారం.. ఇది నిప్పుతో చెలగాటమే..!
Kiren Rijiju On Rahul Gandh
Follow us
Mahatma Kodiyar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 05, 2023 | 12:19 PM

Kiren Rijiju on Rahul Gandhi: జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. ‘జిత్నీ ఆబాదీ – ఉత్నా హక్’ అంటూ రాహుల్ గాంధీ అందుకున్న నినాదం అర్థం కూడా అదే. ఎంత జనసంఖ్య ఉంటే అంత హక్కు లభించాలి అన్నది ఆయన మాటల అర్థం. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తోంది. చూడ్డానికి ఇది ‘సమ న్యాయం’ లేదా ‘సహజ న్యాయం’ అన్నట్టుగా కనిపిస్తున్నా.. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేంద ప్రమాదకారి. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాటల్లో చెప్పాలంటే ఇది నిప్పుతో చెలగాటం. అవును.. ఈ నినాదం ఇది దేశాన్ని కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విభజించి వారి మధ్య అగ్గి రాజేస్తుంది. ఇది అల్పసంఖ్యాక వర్గాలతో పాటు జనాభా నియంత్రణ పాటించి దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన రాష్ట్రాల పాలిట గొడ్డలి పెట్టులా మారుతుంది. మొత్తంగా దేశంలో సమతుల్యతను, ఐక్యతను దెబ్బతీస్తుంది. కేవలం కిరెన్ రిజుజు వంటి రాజకీయ నాయకులే కాదు, సిద్ధార్థ్ లూత్రా వంటి ప్రఖ్యాత న్యాయవాదులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ నినాదాన్ని తీవ్రంగా తప్పుబడుతూ కిరెన్ రిజిజు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో చేసిన ట్వీట్లను గమనిస్తే..

“రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు🔥’జిత్నీ అబాదీ-ఉత్నా హక్’ అంటూ ఆయన చేస్తున్న నినాదం భారతదేశాన్ని చంపేస్తుంది.. అరుణాచల్ ప్రదేశ్, హిమాలయ ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ వంటి రాష్ట్రాలు, జనాభా తక్కువగా ఉన్న వేలాది చిన్న చిన్న సమూహాలు అన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది.. కష్టతరమైన సరిహద్దు ప్రాంతాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవు. ఎందుకంటే చాలా తక్కువ మంది ప్రజలు కఠినమైన పర్వతాలు & ప్రతికూల ప్రాంతాలలో నివసించగలరు.. భారతదేశంలోని ఇలాంటి అల్పసంఖ్యాక వర్గాలకు దేశ నిర్మాణంలో ఎప్పటికీ అవకాశం లభించదు. అధికారం కోసం ఎవరైనా ఇంతలా వ్యవహరిస్తారా?” అంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

హిందీలో చేసిన ట్వీట్‌లో “గుర్తుంచుకోండి; వారి లక్ష్యం బ్రాహ్మణులు కాదు, రాజపుత్రులు కాదు, దళితులు కాదు, వెనుకబడినవారు కాదు, సిక్కులు, ముస్లింలు లేదా క్రైస్తవులు కాదు. యావత్ భారతదేశాన్నే లక్ష్యంగా చేసుకుని కొందరు నేతలు అధికార దాహంతోనే ఇదంతా చేస్తున్నారు.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఆటగాళ్లు దేశం కోసం ఐక్యంగా ఆడుతున్నారని, మరోవైపు సైనికులు ఐక్యంగా మన సరిహద్దులను కాపాడుతున్నారని, కానీ ఇక్కడ ఈ వ్యక్తులు మాత్రం కులతత్వంతో దేశంలో చిచ్చు రాజేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ ..

దేశంలో ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‌గా పేరొందిన సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా ఈ నినాదం వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దు అంటూ వ్యాఖ్యానించారు. “జనాభా ప్రాతిపదికన దామాషా పద్దతి ముఖ్యమే. అయితే జనాభా పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చట్టసభల్లో కల్పించే ప్రాతినిధ్యంలో న్యాయంగా వ్యవహరించాలి. అలాగే జనాభా పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిథ్యం కల్పించి రివార్డు ఇవ్వడం సరికాదు” అంటూ తెలిపారు.

బీహార్‌లో కుల గణన తర్వాత..

రాహుల్ నినాదం కేవలం జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లకే పరిమితం కాదు. దానికి విస్తృత అర్థం ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, సంఖ్యాపరంగా పెద్దవైన కులాలు, వర్గాలకు వారి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నది రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి నాడు ఆ రాష్ట్రంలో చేపట్టిన కులాలవారీ జనాభా లెక్కలు, ఇతర గణాంకాలను విడుదల చేసినప్పటి నుంచి రాహుల్ తన స్వరం పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామంటూ వాగ్దానం కూడా చేసేశారు. అక్టోబర్ 9న ఆ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీ కానుంది. ఈ భేటీ అజెండాలో కులగణన అన్నదే ప్రధానాంశం. జనాభా ఎంత ఉంటే అంత మేర హక్కు అంటూ రాహుల్ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లకు గాలం వేయాలన్నది కూడా వారి వ్యూహంలో భాగం. కానీ ఇది ఇంతటితో ఆగదు. సమాజంలో కులాల మధ్య కొత్త చిచ్చు రాజేస్తుంది. కులరహిత సమాజ స్థాపన లక్ష్యం ఇప్పటికే రిజర్వేషన్ల కారణంగా దెబ్బతింటుండగా.. జనాభా దామాషా పద్ధతిన హక్కులు అంటే ఇక ఎన్నటికీ భారత సమాజం నుంచి కులాన్ని వేరుచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

దీంతోపాటు తదుపరి జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించి జనాభా నియంత్రణను సమర్థవంతంగా కట్టడి చేసిన దక్షిణాది రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం, నష్టం జరగనుంది. ప్రస్తుతం 1971 నాటి జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంటులో రాష్ట్రాలవారిగా సభ్యుల సంఖ్యను నిర్ణయించారు. 1971 నుంచి దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరికొన్ని చిన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధిగా పాటించాయి. అక్షరాస్యత పెరగడం వల్ల కూడా ప్రజల్లో అవగాహన పెరిగింది. కానీ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ ఏమాత్రం అమలుకాకపోగా, ఒక విస్ఫోటనంలా జన సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు తాజా గణాంకాల ప్రకారం డీలిమిటేషన్ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎంపీల సంఖ్యను మరింత కోల్పోతాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సభ్యుల సంఖ్య, ప్రాతినిధ్యం మరింత పెరుగుతాయి.

దక్షిణాది రాష్ట్రాల గళం..

ఇప్పటికే పన్నుల వసూళ్లు, రాష్ట్రాలవారిగా పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న వాదన ఉంది. జనాభాను నియంత్రించి, ప్రగతి సాధించి పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు.. పన్నుల్లో ఆ రాష్ట్రాలకు తిరిగొచ్చేది చాలా తక్కువ. ఎందుకంటే వసూలైన పన్నుల సొమ్మును జనాభా దామాషా ప్రకారమే కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తోంది. దాంతో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలకు అధిక మొత్తంలో నిధులు దక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సహా బీఆర్ఎస్ నేతలు, అడపాదడపా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై గళమెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు చట్టసభల్లోనూ ప్రాతినిధ్యాన్ని కోల్పోయేందుకు ఈ రాష్ట్రాలు ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇలాంటప్పుడు ‘జిత్నీ ఆబాదీ – ఉత్నా హక్’ అన్న నినాదం దేశాన్ని ఎక్కడికక్కడ చీల్చి, సరికొత్త సమస్యను సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..