Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?

పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించిన విషయం తెలిసిందే. అక్కడ కొత్త మంత్రివర్గం కొలువు తీరిన వెంటనే.. అమరీందర్ ఢిల్లీ బయలుదేరుతున్నారు.

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?
Amarinder Singh
Follow us
KVD Varma

|

Updated on: Sep 28, 2021 | 3:17 PM

Punjab Politics: పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించిన విషయం తెలిసిందే. అక్కడ కొత్త మంత్రివర్గం కొలువు తీరిన వెంటనే.. అమరీందర్ ఢిల్లీ బయలుదేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అవమానకరంగా ఆయనను కుర్చీ నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో ఈరోజు (28 సెప్టెంబర్) ఆయన ఢిల్లీ ప్రయాణం పంజాబ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలవవచ్చని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ లో అమరీందర్ ప్రత్యర్థి వర్గాలు అలాగే రాజకీయ విశ్లేషకుల నుండి కాంగ్రెస్ సభ్యుల వరకు అందరూ కెప్టెన్ స్టాండ్ కోసం వేచి ఉన్నారు. నవజ్యోత్ సిద్ధూతో గొడవ కారణంగా అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీని తరువాత, కాంగ్రెస్ హైకమాండ్ చరంజిత్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది.

రాజీనామా చేసిన తర్వాత..

కెప్టెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు అయన బీజేపీ చేరుతారు అనే ఊహాగానాలకు అటు బీజేపీ కానీ, ఇటు అమరీందర్ కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే, అన్ని ఎంపికలు తెరిచి ఉన్నాయని అప్పట్లో కెప్టెన్ చెప్పారు. తొమ్మిది సంవత్సరాల రాజకీయ అనుభవం.. ఒకటిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంతో ఆయన చాలా మంది స్నేహితులను చేసుకున్నాడు. తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారని చెబుతూ వచ్చారు. ఈయన ఇంతకు ముందు అమిత్ షాను కలుసుకున్నారు. కానీ, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదవి నుంచి దిగిపోయాకా, ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనం అవుతుండటం.. బీజేపీ ప్రముఖులను కలిసే అవకాశం ఉందని తెలుస్తుండటంతో ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

అప్పటినుంచే..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2017 సంవత్సరంలో కాంగ్రెస్ హైకమాండ్‌తో గొడవ పడినప్పుడు కెప్టెన్ అప్పటికే ఆయన బీజేపీలో చేరాలని భావించారు. అప్పుడు ప్రతాప్ సింగ్ బజ్వా పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో కెప్టెన్ మొదటి జాట్ మహాసభను ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. అయితే, తరువాత ఆయనకు స్టేట్ కాంగ్రెస్ కమాండ్ అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఒక సందర్భంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ తాను ఎన్నికల ముందు బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు.

వ్యవసాయ చట్టం కెప్టెన్ కు నిచ్చెన కానుందా?

రైతుల నిరసనకు కారణమైన కేంద్ర వ్యవసాయ సంస్కరణ చట్టం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయాల్లో కొత్త నిచ్చెనగా మారుతుందా అనేది ఇప్పుడు పంజాబ్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రైతుల ఉద్యమానికి కెప్టెన్ పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో రైతుల సమస్యలను తీర్చాలంటూ ఆయన ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. ఇప్పుడు బీజేపీలో చేరి.. రైతుల సమస్యపై ఒక పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం అమరీందర్ చేస్తారని భావిస్తున్నారు. దీని ద్వారా పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కొత్త పార్టీ పెడతారా?

ఇంకో వాదన కూడా పంజాబ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. కెప్టెన్ ఇప్పుడు నేరుగా బీజేపీలో చేరకపోవచ్చనీ.. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయవచ్చనీ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పంజాబ్ లో జాత మహాసభను గతంలో ఏర్పాటు చేశారు. ఈయనకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం అప్పచేప్పడంతో ఈ సంస్థ తెరవెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే పద్ధతిలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు పరిశీలకులు అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసి తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పంజాబ్ రాజకీయాల్లో సంచలనం రేపుతారని కూడా ఆ వర్గాలు భావిస్తున్నాయి.

అవమానకరంగా..

కెప్టెన్ అవమానకరంగా ముఖ్యమంత్రి కుర్చీని విడిచిపెట్టాల్సి వచ్చిందని చెప్పారు. దీని తర్వాత ఆయన సిద్ధుపై పెద్ద ఎత్తున మాటల దాడి చేశారు. సిద్ధూను జాతి వ్యతిరేకిగా అభివర్ణించిన ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోనని ప్రకటించారు. సిద్ధుని గెలవకుండా నిరోధించడానికి బలమైన అభ్యర్థులను నిలబెడతానని కచ్చితంగా చెప్పారు. అదే సమయంలో, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి అనుభవం లేదని కూడా ఆయన చెప్పారు. కెప్టెన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అజయ్ మాకెన్, కెసి వేణుగోపాల్‌పై కూడా మాటల యుద్ధం చేశారు.

ఇది పూర్తిగా వ్యక్తిగతం..

అయితే, కెప్టెన్ ఢిల్లీ తన పర్యటనను ‘వ్యక్తిగత సందర్శన’గా అభివర్ణించారు. అమరీందర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ అలాంటి సమావేశం ప్లాన్ చేయలేదని చెప్పారు. మీడియాను ఊహాగానాలు చేయవద్దని కోరారు. దేశ రాజధాని నుండి కొంత మెటీరియల్ సేకరించాల్సి ఉన్నందున వ్యక్తిగత పనుల కోసం తాను ఢిల్లీకి వస్తున్నానని సింగ్ చెప్పారు. “నేను వ్యక్తిగత సందర్శనలో ఉన్నాను” అని కెప్టెన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

PM Modi – 35 Crops : రైతులకు గుడ్ న్యూస్.. 35 రకాల కొత్త వంగడాలను జాతీయం చేసిన ప్రధాని మోదీ..

Huzurabad-Badvel ByPoll Date: హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..