మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి కొత్త డిమాండ్..
సమాజంలో మహిళలపై జరిగే దాడుల గురించి వింటుంటాం.. కానీ ఒక పురుషుడు బాధితుడిగా మారి, కాబోయే భార్య చేతిలోనే దారుణ హత్యకు గురైతే? పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం సరిగ్గా ఇలాంటి చర్చే రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ పురుషుల కమిషన్’ ఏర్పాటు చేయాలనే మళ్లీ డిమాండ్ ఊపందుకుంది.

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఒక కొత్త చర్చకు దారితీసింది. ఉన్నత భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న కేతన్‌ను, అతని కాబోయే భార్య సియా గోయల్ అత్యంత క్రూరంగా అంతం చేయడం సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జూన్ 18న చారిత్రాత్మక లోహగడ్ కోట అంచు పైనుంచి లోయలోకి నెట్టేసి కేతన్‌ను ఆమె హత్య చేసింది. ఈ ఘోరమైన కుట్రలో తన ప్రియుడు చేతన్ చౌదరిని సైతం భాగస్వామిని చేసి, ఈ దారుణానికి ఒడిగట్టడం ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. ఈ ద్రోహం, అమానుష చర్యపై సమాజంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పురుషులపై జరుగుతున్న ఇలాంటి దాడులను విస్మరించలేమని స్పష్టం చేస్తూ.. దేశంలో జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.
రాజ్యసభలోని బీజేపీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఈ ఘోర ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తూ, గతంలో తాను ప్రవేశపెట్టిన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. చట్టం దృష్టిలో లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం జరగాలని ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ స్పష్టం చేశారు. ఈ మేరకు డిసెంబర్ 2025లో తానే స్వయంగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన జాతీయ పురుషుల కమిషన్ ప్రైవేట్ బిల్లుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో మళ్లీ పంచుకున్నారు. ‘‘పూణేలోని కేతన్ అగర్వాల్ కేసు అత్యంత ఆందోళనకరమైనది. ఈ కేసుపై నిష్పాక్షికమైన, సమగ్రమైన, పారదర్శకమైన దర్యాప్తు జరిగి కేతన్ కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రతి బాధితుడికి చట్టం ప్రకారం సమాన రక్షణ లభించాలనే ఉద్దేశంతోనే నేను పార్లమెంట్‌లో ఈ బిల్లును తెచ్చాను’’ అని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు.
పురుషులు కూడా బాధితులే..
మహిళల తరహాలోనే పురుషులు కూడా కొన్ని సందర్భాల్లో బాధితులుగా మారుతున్నారని, ఈ విషయాన్ని చట్టసభలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ మిట్టల్ వాదించారు. పురుషుల సమస్యలను వినడానికి, వారి గొంతుకను వినిపించడానికి ఒక ప్రత్యేక సంస్థాగత వేదిక, మద్దతు, చట్టపరమైన రక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అశోక్ కుమార్ మిట్టల్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2026 ఏప్రిల్‌లో రాఘవ్ చద్దా నాయకత్వంలో బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలలో మిట్టల్ కూడా ఒకరు కావడం గమనార్హం. సాధారణంగా పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లులు ఆమోదం పొందే రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇలాంటి అమానుష సంఘటనల నేపథ్యంలో పురుషుల హక్కుల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ
మరోవైపు ఈ కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో ప్రధాన నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను వాద్గావ్ మావల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల పోలీసు కస్టడీని మరింత పొడిగించాలని పోలీసులు కోరగా.. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పోలీసు కస్టడీ పొడిగింపును తిరస్కరిస్తూ.. ఇద్దరు నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులు ఇప్పుడు బెయిల్ దరఖాస్తులు దాఖలు చేసుకునేందుకు చట్టపరమైన అవకాశం లభించింది.
Pune Ketan Agarwal case is deeply disturbing. Ketan and his family deserve a fair, thorough, and impartial investigation, and above all, justice.
I introduced the National Commission for Men Bill in Parliament. Every victim deserves justice, support, and equal protection under… pic.twitter.com/M6ENpG1T7F
— Ashok Kumar Mittal (@DrAshokKMittal) July 3, 2026
