Prashant Kishor: అక్కడి నుంచి మొదలుపెట్టాల్సింది.. రాహుల్ యాత్రపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర కామెంట్స్
Prashant Kishor: యూపీఏ భాగస్వామ్యపక్షమైన డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులోని కన్యాకమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టడాన్ని పీకే తప్పుబట్టారు. రాహుల్ గాంధీ ఈ యాత్రను తమిళనాడు నుంచి కాకుండా..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ భాగస్వామ్యపక్షమైన డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులోని కన్యాకమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టడాన్ని పీకే తప్పుబట్టారు. రాహుల్ గాంధీ ఈ యాత్రను తమిళనాడు నుంచి కాకుండా.. గుజరాత్ లేదా మరో బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి మొదలుపెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు మద్ధతుగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ తన యాత్రను మొదలుపెట్టాల్సిందన్నారు. లేని పక్షంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తన యాత్రను ప్రారంభించి ఉంటే సరైన నిర్ణయం అయ్యేదని అభిప్రాయపడ్డారు.
విదర్భ ప్రజలు కలిసి కట్టుగా ఉంటే.. తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకోవచ్చని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలన్న లక్ష్యం స్థానికులకు బలంగా ఉన్నప్పుడే.. అది సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక విదర్భ రాష్ట్ర పోరాటం కేంద్రానికి తాకేలా ఉండాలని.. అప్పుడు అది జాతీయ అంశంగా మారుతుందన్నారు. నాగ్‌పూర్‌లో ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధనకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే అశీష్ దేశ్‌ముఖ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం మానేసినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇక తాను ఏ పార్టీకో కాకుండా.. ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.




మరిన్ని జాతీయ వార్తలు చదవండి..