AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మార్చి వరకు అయోధ్య వెళ్లకండి.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచన.. కారణమిదే

ఎప్పుడెప్పుడు ఆ రామయ్య దర్శనం చేసుకుందామా అని ఎదురుచూస్తున్న వారంతా ఇప్పుడు ఒక్కసారిగా అయోధ్యకు పయనమయ్యారు. ఫలితంగా అయోధ్య భక్తులతో కిటకిటలాడిపోతోంది. ఆలయం ప్రారంభమయ్యాక భక్తుల రద్దీ పెరుగుతుందని అధికార యంత్రాంగం ఊహించింది. ఏడాదికి 5 కోట్ల మంది దర్శించుకోవచ్చని అంచనాలు వేసింది. కానీ..

PM Modi: మార్చి వరకు అయోధ్య వెళ్లకండి.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచన.. కారణమిదే
Pm Narendra Modi
Mahatma Kodiyar
| Edited By: Basha Shek|

Updated on: Jan 25, 2024 | 6:49 AM

Share

మార్చి వరకు అయోధ్యను సందర్శించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. ఆ రామయ్యను దర్శించుకోవడం కోసం పోటెత్తిన భక్తజన సముద్రాన్ని చూసిన ప్రధాని, వీఐపీ తాకిడితో వారికి అసౌకర్యం కల్గించకుండా ఉండడం కోసం మంత్రుల పర్యటన వాయిదా వేసుకోవాలని కోరారు. భారతదేశంలో నివసిస్తున్న హిందువులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తరాలుగా స్థిరపడ్డ హిందువులు, భారత సంస్కృతి, సాంప్రదాయలతో అనుబంధం కల్గిన దేశాల ప్రజలు కూడా ఎంతో భావోద్వేగంతో మురిసిపోయిన క్షణం రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవం. ఈ క్షణం కోసం 5 శతాబ్దాలుగా నిరీక్షించారు. ఎప్పుడెప్పుడు ఆ రామయ్య దర్శనం చేసుకుందామా అని ఎదురుచూస్తున్న వారంతా ఇప్పుడు ఒక్కసారిగా అయోధ్యకు పయనమయ్యారు. ఫలితంగా అయోధ్య భక్తులతో కిటకిటలాడిపోతోంది. ఆలయం ప్రారంభమయ్యాక భక్తుల రద్దీ పెరుగుతుందని అధికార యంత్రాంగం ఊహించింది. ఏడాదికి 5 కోట్ల మంది దర్శించుకోవచ్చని అంచనాలు వేసింది. కానీ జనవరి 23న ఒక్కరోజే ఏకంగా 5 లక్షల మంది బాలరాముడి దర్శనం చేసుకున్నారు. అయోధ్యకు దారితీసే రైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేనప్పడే పరిస్థితి ఇలా ఉందంటే.. ఆ తర్వాత ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సగటున రోజుకు 5 లక్షల మంది దర్శించుకునేటట్టయితే ఈ సంఖ్య ఏడాదికి 18 కోట్ల మంది వరకు చేరుతుంది. కానీ అయోధ్యలో మౌలిక వసతులు అంతమందికి సరిపోవు. పైగా ఇప్పుడున్న మౌలిక వసతులు రోజుకు లక్ష మంది వచ్చినా కూడా సరిపోని పరిస్థితి. ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లు చాలా వరకు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అభివృద్ధి పనులు సైతం ఇంకా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అయోధ్యకు చేరుకునే యాత్రికులు ప్రయాణ, భోజన, వసతి విషయాల్లోనే అనేక ఇబ్బందులు, వ్యయప్రయాసలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలాంటప్పుడు కేంద్ర మంత్రులు, ప్రొటోకాల్ కల్గిన ఇతర వీఐపీలు ఇదే సమయంలో దర్శనం కోసం అయోధ్యకు క్యూ కట్టారంటే.. సామాన్య భక్తులు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రధాన మంత్రి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తన కేబినెట్ సహచరులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి వరకు అయోధ్యను సందర్శించవద్దని సూచించారు. ఆలోగా మౌలిక వసతులు సహా పరిస్థితులు చక్కబడతాయని ప్రధాని అంచనా వేస్తున్నారు.

మోదీని కీర్తిస్తూ కేబినెట్ తీర్మానం

బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ ప్రాజెక్టులు, పథకాలకు ఆమోదం తెలపడం కంటే ముందు రామమందిరం గురించి చర్చ జరిగింది. రామజన్మభూమి ఆలయం నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన ఘట్టాలు దిగ్విజయంగా పూర్తిచేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రులు అభినందనలు తెలియజేస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమయంలో ప్రధాని భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. దేశ ప్రజల 5 శతాబ్దాల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఆలయ ప్రారంభంతో నవ శకం మొదలైందని, ఆ శకానికి మోదీ మార్గదర్శకుడని ఇతర మంత్రులు కొనియాడారు. ఈ సందర్భంగానే మోదీ అయోధ్యలో పరిస్థితుల గురించి చర్చిస్తూ మంత్రుల పర్యటన వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించారు.

ఇవి కూడా చదవండి

పర్యటన వివరాలు కాస్త ముందు చెప్పండి

ఇదిలా ఉంటే.. అయోధ్యను సందర్శించడానికి వచ్చే ప్రముఖులు, వీఐపీలు, ప్రొటోకాల్ కల్గిన ముఖ్యులు తమ పర్యటన వివరాలు కాస్త ముందుగా, కనీసం వారం రోజులు ముందే తెలియజేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. తద్వారా సాధారణ భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీఐపీలకు దర్శనం ఏర్పాట్లు చేయడం సాధ్యపడుతుందని, అలాగే వారికి ప్రభుత్వ ఆతిథ్యం అందించడంలోనూ ఇబ్బందులు లేకుండా ఉంటాయని సీఎం భావిస్తున్నారు. ఆలయాన్ని ఉదయం గం. 7.00 నుంచి గం. 11.30 వరకు, మధ్యాహ్నం గం. 2.00 నుంచి రాత్రి గం. 7.00 వరకు సామాన్య భక్తుల కోసం తెరిచి ఉంచుతామని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇది వరకే ప్రకటించింది. అలాగే ఉదయం గం. 6.30, మధ్యాహ్నం గం. 12.00, రాత్రి గం. 7.30కు దేవుడికి హారతి కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీఐపీలు, ఇతర ప్రముఖులకు దర్శనం ఏర్పాట్లు చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ట్రస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సామాన్య భక్తుల దర్శనానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…