PM Modi: మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్‌!

|

Feb 12, 2024 | 4:43 PM

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (ఫిబ్రవరి 12) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఐదురుగురికి ఒకేసారి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ఒకరు. ఆయనకు భారత రత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు కర్పూరీ ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో..

PM Modi: మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్‌!
PM Modi engages with family members of former CM Karpoori Thakur
Follow us on

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (ఫిబ్రవరి 12) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఐదురుగురికి ఒకేసారి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ఒకరు. ఆయనకు భారత రత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు కర్పూరీ ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో దిగిన గ్రూప్‌ ఫొటోను మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘భారతరత్న పురస్కారంకు ఎంపికైన ప్రజా నాయకుడు కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను కలవడం చాలా సంతోషంగా ఉంది. కర్పూరి జీ సమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాల కోసం విశేష కృషి చేశారు. వారి జీవితం, ఆదర్శాలు దేశప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అంటూ తన పోస్టులో మోదీ తెలిపారు.

గత నెలలో కర్పూరీ ఠాకూర్‌ను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎంపీ రామ్‌నాథ్ ఠాకూర్ కర్పూరి ఠాకూర్ కుమారుడు. కర్పూరీ ఠాకూర్‌ కుటుంబంతో గ్రూప్‌ ఫొటో దిగిన తర్వాత ప్రధాని మోదీ రామ్‌నాథ్ ఠాకూర్‌తో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడినట్లు సమాచారం. కర్పూరీ ఠాకూర్‌పై రాసిన పుస్తకాన్ని కూడా ఆయన ప్రధాని మోదీకి బహూకరించారు. జనవరి 24న కర్పూరీ ఠాకూర్ జయంతి సందర్భంగా భారతరత్నతో సత్కరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ రామ్‌నాథ్ ఠాకూర్‌కు స్వయంగా ఫోన్ ద్వారా తెలియజేశారు. కర్పూరి ఠాకూర్ 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ గౌరవం లభించింది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి ‘భారతరత్న’ ప్రకటించింది. ఈ ఏడాదికి బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించారు. ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. 1999లో గరిష్ఠంగా నలుగురికి ఈ అవార్డు ప్రదానం చేశారు. 1954 నుంచి ఇప్పటి వరకు మొత్తం 53 మందికి భారతరత్న అవార్డు దక్కింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి, అత్యున్నత స్థాయి పనితీరు ప్రదర్శించినవారికి కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ అందజేస్తూ వస్తోంది. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, పతకం అందజేస్తారు. ఎలాంటి నగదు ప్రోత్సాహం లభించదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.