ఒడిశా రైలు ప్రమాదాలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే మంత్రితో మాట్లాడిన ఆయన బాధితులను అవసరమైన సాయమందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఘటనా స్థలి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ప్రధాని కాసేపట్లో సంఘటనా స్థలికి చేరుకోనున్నారు. ఇప్పటికే మోడీ ఒడిశాకు పయనమైనట్లు సమాచారం. అక్కడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని పరామర్శించనున్నారు. కాగా ఇక ఇప్పటివరకు 238 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. అలాగే 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. రైలు ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని ఆమె ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలిశాక తీవ్ర ఆవేదనకు లోనయ్యాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా విచారం వ్యక్తం చేశారు.
కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. బాధితులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటూ రాష్ట్ర సహాయక బృందాలు, ఎయిర్‌ఫోర్సు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలయిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..