విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. మెడికల్ పీజీ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పీజీ మెడికల్ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా ఆధారంగా సీట్ల కేటాయింపు ఇకపై చెల్లదని స్పష్టం చేసింది. రాష్ట్రాల కోటాలో 50 శాతం స్థానికుల కోసం రిజర్వ్ చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఆ వివరాలు

ఇకపై పీజీ మెడికల్ సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ వైద్య కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. నివాస ఆధారిత రిజర్వేషన్లు సమానత్వానికి భంగం కలిగిస్తాయని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
విద్యాసంస్థల్లో ప్రవేశాలకు భౌగోళిక పరిమితులు విధించడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. ఎక్కడైనా నివసించే, విద్యను అభ్యసించే హక్కు భారతీయులకు ఉందని.. ఎలాంటి భిన్నత్వం లేకుండా విద్యావకాశాలు అందుబాటులో ఉండాలని జస్టిస్ సుధాంశు ధులియా వ్యాఖ్యానించారు. మెరిట్ విషయంలో రాజీపడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఛండీగఢ్ మెడికల్ కాలేజీ కేసుకు సంబంధించి ఈ తీర్పు వెలువరిచింది. కేంద్ర పాలిత ప్రాంత విద్యార్థులకు లేదా అదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పీజీ సీట్లు కేటాయించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర కోటా సీట్లకు సంబంధించి ఈ కీలక తీర్పును ఇచ్చింది. అయితే ఇప్పటికే కేటాయించిన అడ్మిషన్లపై ఈ తీర్పు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పీజీ మెడికల్ ప్రవేశాల్లో సమానత్వానికి మరింత దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..