AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council: జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు.. ప్రస్తుతం సరియైన సమయం కాదుః ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Petrol Diesel Under GST:పెట్రోల్, డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకురావడానికి ఇది సరియైన సమయం కాదని GST కౌన్సిల్ భావించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

GST Council:  జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు.. ప్రస్తుతం సరియైన సమయం కాదుః ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman
Balaraju Goud
|

Updated on: Sep 17, 2021 | 9:23 PM

Share

Nirmala Sitharaman on Petrol Diesel Under GST: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి వెనక్కు తగ్గింది. పెట్రోల్, డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకురావడానికి ఇది సరియైన సమయం కాదని GST కౌన్సిల్ భావించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని జీఎస్టీ పరిధిలో చేర్చడం అంత మంచిది కాదని మండలి అభిప్రాయపడిందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఇవాళ సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించామని ఆమె వివరించారు. శుక్రవారం జరిగిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్‌ పెట్రోల్, డీజిల్‌ని పరోక్ష పన్ను పరిధిలోకి తీసుకువస్తుందని అంతా భావించారు. జీఎస్‌టీ కౌన్సిల్ తాజా నిర్ణయం నిరాశ పరిచింది. పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి చేర్చడానికి అయా రాష్ట్రాలు సైతం వ్యతిరేకించినట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైంది. అనంతరం కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో మంత్రి నిర్మలా వెల్లడించారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కేరళ హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా భౌతిక సమావేశం కావడం విశేషం. అంతకు ముంద చివరి సమావేశం 20 నెలల క్రితం 18, డిసెంబర్ 2019 న జరిగింది. అప్పటి నుండి GST కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతూ వస్తుంది.

అలాగే, కోవిడ్‌ సంబంధిత ఔషధాలపై తగ్గింపు డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పారు. ప్రస్తుతం సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. ఇక, క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.

ఇక, సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలిరీ చేసే స్విగ్గీ, జొమాటో వంటి సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వినియోగదారులపై కొత్తగా ఎలాంటి పన్నూ వేయడం లేదన్నారు. అదే సమయంలో గతంలో సంబంధిత రెస్టారెంట్‌ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లించాలని నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.

Read Also… CM Jagan: ఇంతకుముందెన్నడూ లేని విధంగా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్‌