Waqf Bill: వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు
వివాదాస్పద వక్ఫ్ బోర్డ్‌కు లోకసభలో ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభలో బిల్లు పాసయింది. చర్చలో విపక్షాల లొల్లితో లోక్‌సభ వేడెక్కింది. ఇది చట్టవ్యతిరేకం.. జగడాల కోసమే ఈ బిల్లును తెచ్చారంటూ నిండు సభలో పేపర్లు చింపి నిరసన తెలిపారు అసదుద్దీన్ ఒవైసీ.

వివాదాస్పద వక్ఫ్ బోర్డ్ సవరణల బిల్లుకు లోకసభలో ఆమోద ముద్ర పడింది. అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పోలయ్యాయి. అధికార,విపక్ష సభ్యుల వాదనలు ప్రతివాదనలతో సభ మార్మోగింది.దాదాపు 14 గంటలకు పైగా రికార్డు స్థాయిలో చర్చ జరిగింది. చివరకు 56 ఓట్ల తేడాతో విపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఎన్‌డీఏ మిత్ర పక్షాలు టీడీపీ,జేడీయూ, శివసేన షిండే,లోక్‌జన శక్తి బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంతో విపక్షాల అంచనాలు తలకిందులయ్యాయి. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలపై జరిగిన చర్చలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది చట్టవ్యతిరేకం..జగడాల కోసమే ఈ బిల్లును తెచ్చారంటూ నిండు సభలో బిల్లు ప్రతుల్ని చింపేశారాయన.
వక్ఫ్ బోర్డులో కలెక్టర్‌కు చోటు కల్పించడాన్ని పూర్తిగా సమర్ధించారు హోంమంత్రి అమిత్‌షా.. వక్ఫ్ భూముల పేరుతో గతంలో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. ఇకపై అలాంటి అక్రమాలకు తావుండదన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. మైనారిటీ సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎంపీ కృష్ణప్రసాద్. టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలకు కి JPC ఒప్పుకుందన్నారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటులో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది టీడీపీ. లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, ఏపీలో ముస్లింలకు అన్యాయం చేసిందన్నారు.
పెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమే పెద్ద సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు అఖిలేష్ యాదవ్. ఐదుగురు సభ్యుల నుంచి ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మీలా బీజేపీ కుటుంబ పార్టీ కాదని కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభలో గట్టెక్కిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
