AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయం.. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే మా లక్ష్యంః ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కీలక ప్రసంగం చేస్తున్నారు. "నేను సభకు వాస్తవాలు, తర్కంతో కూడిన సమాచారాన్ని అందిస్తాను. ఇది దేశానికి చాలా ముఖ్యమైన రోజు. దీనిని 20-25 ఏళ్ల క్రితమే ఆమోదించి ఉండాల్సింది" అని అన్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయి.

Balaraju Goud
|

Updated on: Apr 16, 2026 | 3:56 PM

Share

నారీ శక్తికి పెద్దపీట వేస్తూ, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రాజకీయ యవనికపై ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (నారీ శక్తి వందన్ అభియాన్)పై లోక్‌సభలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. దేశ భవిష్యత్తును మార్చే ఈ అడుగు 25-30 ఏళ్ల క్రితమే పడాల్సిందని, అయితే కాలం ఆ బాధ్యతను తమ ప్రభుత్వానికి అప్పగించిందని ఆయన ఉద్ఘాటించారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” మంత్రాన్ని స్మరిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం అంటే కేవలం రోడ్లు, రైల్వేలు మాత్రమే కాదని, దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు విధాన రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించడమేనని స్పష్టం చేశారు. “మహిళలకు కేవలం ప్రాతినిధ్యం మాత్రమే కాదు, నిర్ణయాధికారం ఉండాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గతంలో మహిళా హక్కులను అడ్డుకున్న వారిని చరిత్ర క్షమించదని హెచ్చరిస్తూనే, ఈ బిల్లు ఆమోదాన్ని ఏ ఒక్క పార్టీ రాజకీయ లబ్ధిగా చూడవద్దని ప్రధాని కోరారు. 30 ఏళ్ల క్రితం మహిళలు మౌనంగా ఉండేవారని, కానీ నేడు లక్షలాది మంది మహిళలు క్షేత్రస్థాయిలో నాయకులుగా ఎదిగి తమ గళాన్ని వినిపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన తనకు దేశం ఇంతటి బాధ్యతను అప్పగించడమే రాజ్యాంగం గొప్పతనమని, అదే రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా శక్తిని చట్టసభలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

21వ శతాబ్దపు భారతదేశం ప్రపంచవ్యాప్త ఆమోదాన్ని పొందుతోందని, మన ఆడబిడ్డలు ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేస్తున్నారని ప్రధాని కొనియాడారు. “మహిళలు మన నిర్ణయాల కంటే మన ఉద్దేశాలను ఎక్కువగా గమనిస్తారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నారీ శక్తికి సముచిత స్థానం కల్పించడమే తమ సంకల్పమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

“మనం దేశ నారీ శక్తిని అణచివేస్తున్నామనే భ్రమలో గానీ, అహంకారంలో గానీ ఉండవద్దు, ఇది వారి హక్కు. మనం దశాబ్దాలుగా వారిని అణచిపెట్టాము, ఆ పాపం నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ఇది ఒక అవకాశం.” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా మహిళలు గళం విప్పుతున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా, పంచాయతీలకు ప్రాతినిధ్యం వహించి, ప్రజల సుఖదుఃఖాలను చూసిన లక్షలాది సోదరీమణులు ఆందోళన చెందుతున్నారని ప్రధాని మోదీ అన్నారు.

ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “దీని వెనుక మోదీకి రాజకీయ ఉద్దేశం ఉందని కొందరు అనుకుంటున్నారు. మీరు దీనిని వ్యతిరేకిస్తే, నాకు సహజంగానే రాజకీయంగా లాభం చేకూరుతుంది, మనం దీనికి మద్దతు ఇస్తే ఎవరికీ నష్టం జరగదు.” అని అన్నారు. “మాకు క్రెడిట్ అక్కర్లేదు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ఒక ప్రకటన ఇచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. క్రెడిట్ కోసం మీకు ముందే ఒక బ్లాంక్ చెక్ ఇస్తున్నాను.” అని ప్రధాని మోదీ తెలిపారు.

Follow Us