Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ డ్రగ్స్ దందా ఆందోళన.. ఒక తరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
మాదక ద్రవ్యాల రవాణా, ముఖ్యంగా హెరాయిన్, కాశ్మీర్‌లో కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. నిపుణులు ఈ ముప్పు వలన ఒక తరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అదేవిధంగా, చాలా మంది యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.
Jammu Kashmir: మాదక ద్రవ్యాల రవాణా, ముఖ్యంగా హెరాయిన్, కాశ్మీర్‌లో కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. నిపుణులు ఈ ముప్పు వలన ఒక తరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అదేవిధంగా, చాలా మంది యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తోందని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ అన్నారు. మూడు దశాబ్దాల తీవ్రవాద హింస ఒక తరాన్ని కబళించగా, మాదక ద్రవ్యాల దుర్మార్గం నేటి తరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక కార్యకర్తలు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కాశ్మీర్‌లో గత రెండేళ్లలో మాదక ద్రవ్యాల ముప్పు గణనీయంగా పెరిగిందని, పంజాబ్, జమ్మూ సరిహద్దుల మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని దిల్బాగ్ సింగ్ అన్నారు. మాదక ద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదానికి ఆర్థికసాయం అందిస్తున్నారనీ, అందుకే దీనిపై మరింత అప్రమత్తంగా ఉండి అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఉత్తర కాశ్మీర్‌లోని కర్నాహ్, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాలు డ్రగ్స్ ముప్పులో మునిగివున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసు చీఫ్ తెలిపారు.
శ్రీనగర్, జమ్మూలో డి-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటులో పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని, ఉత్తర కశ్మీర్‌లో మరికొన్ని డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ చీఫ్ ఇంకా ఈవిషయంపై మాట్లాడుతూ.. యువతను ప్రమాదం నుంచి తొలగించడానికి సామాజిక-మత నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఇది సరైన సమయం. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రేపు మనకు సమయం ఉండకపోవచ్చనీ.. వేగంగా ఈ సమస్యపై పనిచేయడం మంచిదనీ సూచించారు.
పెద్ద సంఖ్యలో యువకులు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు
శ్రీనగర్‌లోని డి-అడిక్షన్ సెంటర్ హెడ్ డాక్టర్ మహ్మద్ ముజఫర్ ఖాన్ కూడా ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డ్రగ్స్ బారిన పడిన వారి సంఖ్యతో పోల్చితే లోయలో ఇలాంటి కేంద్రాల సంఖ్య చాలా తక్కువని చెప్పారు. పెద్ద సంఖ్యలో యువకులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నందున మైదానంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఖాన్ అన్నారు. ఇంతకుముందు, మేము 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలను మాదకద్రవ్యాలకు బానిసలు కావడం చూసేవాళ్ళం. కానీ, ఇప్పుడు 12 – 13 సంవత్సరాల వయస్సు గల వారిపై కేసులు ఉన్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం స్వభావం కూడా మారిపోయింది. గతంలో ఇది చరస్ లేదా ఔషధ ఓపియాయిడ్లుగా దొరికేది. కానీ ఇప్పుడు హెరాయిన్ వాటి స్థానంలో వచ్చి చేరింది. ఇది ప్రమాదకర పరిణామం అని ముజఫర్ ఖాన్ అంటున్నారు.
యువత త్వరగా హెరాయిన్‌కు బానిసలవుతున్నారని, కొద్ది రోజుల్లోనే మత్తు ఇంజెక్షన్లపై ఆధారపడతారని ఖాన్ అన్నారు. ఈ ముప్పు కశ్మీర్ అంతటా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ధనిక-పేద తేడా లేకుండా అందరిలో వ్యాపించిందని ఆయన అన్నారు. తన నేతృత్వంలోని యూత్ డెవలప్ మెంట్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ లో 50 పడకల ఆసుపత్రి ఉందన్నారు. ఖాన్ మాట్లాడుతూ, “బాధిత వ్యక్తుల సంఖ్యతో పోల్చితే ఇది చిన్న కేంద్రం. సుమారు 10 సంవత్సరాల క్రితం, ఇక్కడ డి-అడిక్షన్ సెంటర్లు అవసరం. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మెడికల్ ఎమర్జెన్సీ సదుపాయం అవసరం. ఎందుకంటే, కొన్నిసార్లు అధిక మోతాదులో హెరాయిన్ తీసుకోవడంతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న వారికి వెంటనే వెంటిలేటర్ చికిత్స అవసరం అవుతుందని ఆయన వివరించారు.
చికిత్స తర్వాత కౌన్సెలింగ్ చాలా ముఖ్యం
నేషనల్ సెంటర్ ఫర్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ ‘భారతదేశంలో మాదకద్రవ్యాల వినియోగం పరిమాణం’పై నిర్వహించిన ఒక సర్వేను ఖాన్ ప్రస్తావిస్తూ, ఇవన్నీ స్టీరియోటైప్. అంచనాలు.(ఈ సర్వేలో జమ్మూకశ్మీర్ డ్రగ్స్ వినియోగంలో ఐదో స్థానంలో నిలిచిందని, కేంద్రపాలిత ప్రాంతంలో ఆరు లక్షల మందికి పైగా డ్రగ్స్ బారిన పడ్డారని ఎయిమ్స్ తెలిపింది) ప్రతిరోజూ 10 నుండి 15 మంది వరకు వచ్చే రోగుల సంఖ్యను పరిశీలిస్తే, ఎక్కువ మంది ప్రజలు దీని బారిన పడుతున్నారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
మాదకద్రవ్యాల బాధితులకు వైద్య సహాయం, పునరావాసం అందించడానికి పనిచేస్తున్న ఎన్‌జిఓ కన్సర్న్డ్ ఎబౌట్ యూనివర్సల్ సోషల్ ఎంపవర్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు మీర్ జుబైర్ రషీద్ మాట్లాడుతూ, “మేము పోరాటంలో ఒక తరాన్ని కోల్పోయాము. తరువాతి తరం మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల నష్టపోతుంది.’ రషీద్ మాట్లాడుతూ.. చికిత్స తర్వాత కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. మన వైపు నుండి మనం ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నాము, అయితే మొత్తం సమాజం మేల్కొలపాలని నేను భావిస్తున్నాను అని అన్నారు.
ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!