Medical Oxygen Shortage: ఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ కొరతతో మరో 20 మంది బలి.. మరికొంత మంది పరిస్థితి విషమం
Oxygen shortage in Delhi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో
Oxygen shortage in Delhi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ఆక్సిజన్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 22 మంది కరోనా రోగులు చనిపోయిన సంఘటన తెలిసిందే. అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు శనివారం వెల్లడించారు. ఆక్సిజన్ లేకపోవడంతో మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని.. ఏం చేయలేని పరిస్థితి నెలకొందంటూ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం అర గంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇదిలాఉంటే.. ఢిల్లీలోని బాట్రా ఆసుపత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 350 మంది రోగులు కరోనా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆక్సిజన్ కొరతపై ఈ రోజు ఉదయం ఢిల్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఒక ఆక్సిజన్ ట్యాంకర్‌ను సమకూర్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం గంటన్నర వరకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. ప్రతి రోజు తమ ఆసుపత్రికి 8 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరమని పేర్కొన్నారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లాక్డౌన్ విధించి కేసుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటకీ.. ఓ వైపు కేసులు పెరుగుతుండటం, మరోవైపు ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also read: