మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ అవినీతి కేసు, దాడులు
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ అవినీతి కేసు దాఖలు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఈ సంస్థ ప్రాథమిక దర్యాప్తు శుక్రవారం పూర్తి కాగా..
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ అవినీతి కేసు దాఖలు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఈ సంస్థ ప్రాథమిక దర్యాప్తు శుక్రవారం పూర్తి కాగా.. ఆయన నివాసంతో సహా 4 చోట్ల అధికారులు దాడులు చేశారు. అనిల్ అవినీతికి పాల్పడ్డారని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఇన్వెస్టిగేట్ చేయాలనీ బాంబేహైకోర్టు ఈ నెల మొదట్లో సీబీఐని ఆదేశించింది. ఆయనపై అవినీతి కేసు పెట్టాలా, వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సంస్థకు 15 రోజుల వ్యవధిని ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అనిల్ దేశ్ ముఖ్ పైన, మరికొందరి పైన ఈ నెల 6 న ప్రాథమిక ఎంక్వయిరీ నమోదు చేసింది. ప్రస్తుతం ముంబై, నాగ్ పూర్ సహా మరో రెండు చోట్ల సీబీఐ అధికారులు దాడులు, సోదాలు చేస్తున్నారు. నైతిక కారణాలపై తాను పదవి నుంచి వైదొలగుతున్నానంటూ అనిల్ దేశ్ ముఖ్ ఈ నెలారంభంలో పదవికి రాజీనామా చేశారు. ఎన్సీపీకి చెందిన ఈయన వ్యవహారం సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వానికి తలనొప్పి కలిగించింది.
,ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ని ప్రభుత్వం మరో విభాగానికి బదిలీ చేయడం, తన బదిలీని సవాలు చేస్తూ ఆయన కోర్టుకెక్కిన విషయం గమనార్హం. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, , నెలకు 100 కోట్లను ముంబైలోని రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బుల నుంచి వసూలు చేయాలనీ దేశ్ ముఖ్ మాజీ పోలీస్ అధికారి వాజేని ఆదేశించారని పరమ్ బీర్ సింగ్ తన పిటిషన్ లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను దేశ్ ముఖ్ ఖండించారు. తనపై సీబీఐ విచారణ జరిపించుకోవచ్చునని బీరాలు పలికారు. అన్నట్టే కోర్టు ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు సోదాలు, దాడులు కూడా జరిగాయి గనుక ఆయన మరిన్ని చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.