Tamil Nadu: స్థల పురాణం మూలాలతో తవ్వకాలు.. బయటపడింది చూసి షాక్..!
ఆలయం నిర్మాణం.. మూలాల తాలూకు వివరాలన్నీ స్థలపురాణంలో ఉన్న విషయాన్ని స్థానికులు పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజీ అధికారులకు అబ్భురపరిచే నిర్మాణాలు బయటపడ్డాయి. పురాతన నిర్మాణాలకు సంబంధించిన సమాచారంతో తవ్వకాలు జరిపితే మరోసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.

తమిళనాడులో చోళులు పల్లవుల పరిపాలనలో అద్భుతమైన కళాఖండాల నిర్మాణం జరిగింది. దక్షిణాదిన తమిళనాడులో ఎక్కువగా ఈ పురాతన కట్టడాలు ఆలయాలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే..! వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ నిర్మాణాలు ఇప్పటికీ చాలా చోట్ల చెక్కుచెదరకుండా నాటి కళా వైభవాన్ని చాటి చెబుతున్నాయి. అప్పట్లో ఎలాంటి సాంకేతికత లేకుండా జరిగిన నిర్మాణాలు ఇప్పటికీ అబ్బురపరుస్తూ ఉంటాయి.
తమిళనాడులో ఇటీవల కాలంలో పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు అనేకం బయటపడ్డాయి. చరిత్రలో తెలిపిన వివరాల ప్రకారం జరిపిన తవ్వకాల్లో వాటి అవశేషాలను గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు వాటిపై ఇంకా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి పురాతన నిర్మాణాలకు సంబంధించిన సమాచారంతో తవ్వకాలు జరిపితే మరోసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
తిరువళ్లూరు సమీపంలో చోళుల కాలంలో నిర్మించిన మురుగన్ ఆలయంలో ఒక సొరంగం ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. తవ్వకాల్లో బయటపడ్డ ఈ సొరంగంపై తమిళనాడు లో ఆసక్తిగా మారింది. తిరువళ్లూరుకు సమీపంలో ఉన్న పట్టరైపెరుమంతూర్‌లో కులుత్తుంగ చోళరాజుల పాలనలో నిర్మించిన ప్రాచీన మురుగన్ ఆలయం ఉంది. ఈ ఆలయం పదవ శతాబ్దానికి చెందినదిగా స్థలపురాణంలో ఉంది. తిరువళ్లూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యమైన రోజులలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
అయితే, చెన్నై-తిరుపతి జాతీయ రహదారి విస్తరణ లో భాగంగా ఆలయ ప్రాంతంలో కొంతభాగం కూల్చివేయాలని అధికారులు ప్రతిపాదించారు. అధికారుల నిర్ణయంతో విభేదించిన స్థానికులు ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని రక్షించాలని, ఆలయానికి సంబంధించి సొరంగ మార్గాలు ఉన్నాయని, గుప్త నిధులు ఉన్నాయని, ఈ ఆలయాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరారు. అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కరుణించిన అధికారులు తవ్వకాలు చేపట్టారు.
గ్రామస్థుల అభ్యర్ధన మేరకు తిరువల్లూరు జిల్లా పురావస్తు శాఖ ఇన్స్‌పెక్టర్ లోకనాథన్ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. సుబ్రహ్మణ్య స్వామి(మురుగన్) రాతి విగ్రహం ఉన్న ఆలయంలో తనిఖీలు చేసిన అధికారులు, లోపల ఒక సొరంగ మార్గం ఉందని గుర్తించారు. ఈ మార్గం తిరువేలంగాడులోని ప్రాచీన శివాలయం వరకు ఉంటుందని స్థల పురాణంలో ఉండడంతో ఈ సొరంగ మార్గం ఎక్కడి వరకు ఉంది అనే విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.
సొరంగ మార్గం బయటపడ్డ విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు ఆలయానికి పోటెత్తారు. గతంలో పట్టరైపెరుమంథూర్ ప్రాంతంలో ఇప్పటికే మూడు దశల వారీగా పురావస్తు అధికారులు తవ్వకాలు జరపడంతో 1000 కి పైగా పురాతన శకలాలు, శిల్ప సంపద బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో చోళుల కాలంలో రాతితో నిర్మించిన బావి తమిళుల చరిత్రను తెలుపుతోందని చరిత్రకారులు అంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..