AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindhu: భారత్‌ మాతాకీ జై.. దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్‌! ఇరాన్‌ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎంతమంది వచ్చారంటే?

ఇరాన్‌లోని సంఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించి 290 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం సహకారం అభినందనీయం. ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్‌ నుండి కూడా పౌరులను తరలించనుంది.

Operation Sindhu: భారత్‌ మాతాకీ జై.. దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్‌! ఇరాన్‌ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎంతమంది వచ్చారంటే?
Indian Students
SN Pasha
|

Updated on: Jun 21, 2025 | 8:50 AM

Share

ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 290 మంది భారతీయ పౌరులను ఇండియాకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సమయంలో ‘భారత్ మాతా కీ జై’, ‘హిందూస్తాన్ జిందాబాద్’ నినాదాలతో ఎయిర్‌ పోర్ట్‌ దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో తమను సురక్షితంగా తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్‌ నుంచి వచ్చిన నోయిడా నివాసి తజ్కియా ఫాతిమా మాట్లాడుతూ.. “అక్కడ యుద్ధ పరిస్థితి ఉంది. మేం అక్కడి నుండి ఎలా బయటపడతామో అని భయపడ్డాం. కానీ భారత ప్రభుత్వం మొత్తం ప్రక్రియను చాలా సజావుగా చేసింది. నేను భారత ప్రభుత్వానికి థ్యాంక్యూ. నేను నోయిడా నివాసిని” అని ఆమె అన్నారు.

విద్యార్థులను, ఇతర పౌరులకు ఎయిర్‌ పోర్ట్‌లో స్వాగతం పలికిన విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (CPV & OIA) అరుణ్ కుమార్ ఛటర్జీ మాట్లాడుతూ.. “ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుండి 290 మంది భారతీయ పౌరులను తీసుకొచ్చిన మూడవ విమానం ల్యాండ్‌ అయింది. వారిలో 190 మంది జమ్మూ కాశ్మీర్ నుండి, మరికొందరు ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు. ఇరాన్ ప్రభుత్వం మన కోసం తన గగనతలాన్ని తెరిచి ఉంచడం సంతోషం కలిగించింది. ఇది భారత్‌, ఇరాన్ మధ్య మంచి సంబంధాన్ని చూపిస్తుంది. మన పౌరులు స్వదేశానికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధు విమానాలు త్వరలో ఇజ్రాయెల్ నుండి కూడా ప్రారంభమవుతాయి.” అని పేర్కొ్న్నారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. “ఆపరేషన్ సింధు విమానం పౌరులను ఇంటికి తీసుకువస్తుంది. చార్టర్ విమానంలో విద్యార్థులు, మతపరమైన యాత్రికులు సహా 290 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుండి తరలించారు. ఈ విమానం జూన్ 20న 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంది. కార్యదర్శి (CPV & OIA) అరుణ్ ఛటర్జీ వారికి స్వాగతం పలికారు. తరలింపు ప్రక్రియను సులభతరం చేసినందుకు భారత ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతుంది.” అని ఆయన అన్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం 9 రోజులకు చేరుకుంది. జూన్ 13న ఇరాన్ అణు, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించిన తర్వాత వివాదం చెలరేగింది. ప్రతీకారంగా ఇరాన్ ట్రూ ప్రామిస్‌ 3 పేరుతో అనేక డ్రోన్, క్షిపణి దాడులను కూడా ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి