మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్ డెడ్..పలువురికి గాయాలు
కర్ణాటకలోని మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

కర్ణాటకలోని మైసూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. డిసెంబర్ 25 గురువారం రాత్రి మైసూరు(Mysore)లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడు కారణంగా ఒకరు అక్కడికిక్కడే మృతిచెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించింది. కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ కెఎస్ సుందర్ రాజ్ నేతృత్వంలోని నగర పోలీసులు ఎఫ్ఎస్ఎల్ బృందం, యాంటీ సబ్బోటేజ్ చెక్ బృందం, డాగ్ స్క్వాడ్ వంటి ప్రత్యేక బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన వ్యక్తి, గాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. నజర్‌బార్డ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్యాలెస్ ప్రాంగణంలో వాసుకి వైభవ్ సంగీత కచేరీ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారంతా సంగీతంలో లీనమై ఆస్వాదిస్తున్న సమయంలో గేటు దగ్గర ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో రాణేబెన్నూర్‌కు చెందిన 34 ఏళ్ల కొట్రేష్ కాళ్లకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతడు కెఎస్‌ఆర్‌టిసి హవేరి డివిజన్ ఉద్యోగి. గురువారం తన భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో సెలవుల కోసం మైసూరుకు వచ్చాడు. కాగా, మృతుడిని మైసూరు ప్యాలెస్‌లోని జయమార్తాండ గేటు దగ్గర బెలూన్‌లకు హీలియం గ్యాస్ నింపి అమ్మే బెలూన్ల వ్యాపారి సలీం (40) గా గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
