న్యాయం..అన్యాయం..! ఆ తల్లి ఆవేదనకు అంతం లేదా?
కన్నబిడ్డని కిరాతకంగా పొట్టనపెట్టుకున్న మానవమృగాలు రేపటి సూర్యోదయాన్ని చూడలేవన్న ఆశ అంతలోనే ఆవిరైపోయింది. ఇన్నేళ్ల గుండె బరువు కొంతైనా దిగిపోతుందనుకున్న ఆ తల్లికి తీరని వేదనే మిగిలింది. చట్టంలోని లొసుగులు ఆ దుర్మార్గుల చావును వాయిదావేశాయి. న్యాయదేవత కళ్లకు కట్టిన గంతల సాక్షిగా రోజుకో పిటిషన్‌తో చెలగాటమాడిన నిందితుల వ్యూహమే ఫలించింది. నిద్రలోనూ కన్నపేగు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేచి కన్నీళ్లు పెట్టుకుంటున్న నిర్భయతల్లిని.. న్యాయం మరోసారి పరిహసించింది. చావు ఎప్పటికైనా అనివార్యమే. ఎందుకంటే వారు చేసిన నేరం […]
కన్నబిడ్డని కిరాతకంగా పొట్టనపెట్టుకున్న మానవమృగాలు రేపటి సూర్యోదయాన్ని చూడలేవన్న ఆశ అంతలోనే ఆవిరైపోయింది. ఇన్నేళ్ల గుండె బరువు కొంతైనా దిగిపోతుందనుకున్న ఆ తల్లికి తీరని వేదనే మిగిలింది. చట్టంలోని లొసుగులు ఆ దుర్మార్గుల చావును వాయిదావేశాయి. న్యాయదేవత కళ్లకు కట్టిన గంతల సాక్షిగా రోజుకో పిటిషన్‌తో చెలగాటమాడిన నిందితుల వ్యూహమే ఫలించింది. నిద్రలోనూ కన్నపేగు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేచి కన్నీళ్లు పెట్టుకుంటున్న నిర్భయతల్లిని.. న్యాయం మరోసారి పరిహసించింది.
చావు ఎప్పటికైనా అనివార్యమే. ఎందుకంటే వారు చేసిన నేరం అంత తీవ్రమైంది. సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానమే ఆ నరరూప రాక్షసులకు బతికే హక్కులేదని తీర్పు ఇచ్చి ఏళ్లు గడిచిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆ నలుగురికీ ఎప్పుడో ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయి ఉండేవి. ఉరితాళ్లు సిద్ధమయ్యాయి. తలారి కూడా రెడీ. కానీ న్యాయం దోబూచులాడుతోంది. చట్టం అందరికీ సమానమేనన్న న్యాయసూత్రంతో చావు వాయిదా పడుతోంది. ఆ రోజొస్తే ఎలాగూ తప్పదు. అయితే యమభటులు తట్టిలేపే చివరిక్షణం దాకా ఎలాగైనా బతికేయాలన్న ఆ నీచుల కుయుక్తులకు ఏదో రూపంలో కొత్త కొత్త దారులు దొరుకుతున్నాయి.
ఫిబ్రవరి 1..నిర్భయ నిందితుల చివరిరోజు అవుతుందని యావత్ దేశం భావించింది. వారికి అన్ని దారులూ మూసుకుపోయినట్లేనని అంతా అనుకున్నారు. పిటిషన్ వేసిన నిందితుడిని ప్రస్తుతానికి మినహాయించి మిగిలిన ముగ్గురికీ ఉరి వేయొచ్చని కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. అయితే నలుగురికీ ఏకకాలంలో ఉరిశిక్ష అమలు చేయాలన్న తీర్పు ఆధారంగా…నిందితులంతా ఇంకొన్నాళ్లు బతికిపోయారు. ఇన్‌స్టంట్ జస్టిస్ కోరుకోవడం తప్పనేవారిని కూడా పునరాలోచనలో పడేసే పరిణామాలివి. చేసిన నేరంపై నిందితుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఎలాగోలా శిక్ష వాయిదాపడుతూ పోతే పిలిచి టైంకి భోజనం పెట్టే జైల్లోనైనా బతికేద్దామన్న ఆలోచన. ఎన్నాళ్లిలా?
తన బిడ్డను కిరాతకంగా చంపిన మృగాళ్ల ప్రయత్నమే మరోసారి ఫలించిందని తెలియగానే కోర్టు ముందే కన్నీరుపెట్టింది నిర్భయ తల్లి. తన బిడ్డ కేసు ఉన్నరోజు అందరికంటే ముందే వచ్చి న్యాయంకోసం పడిగాపులు కాసిన ఆ అమ్మ ఇంకెన్నాళ్లు నిద్రలేని రాత్రులు గడపాలో?. మొదటిసారి కాదు. నిందితుల ఉరి వాయిదాపడటం ఇది మూడోసారి. అందుకే ఆ అమ్మ కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఏడేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆ తల్లి గుండె తల్లడిల్లింది. చట్టంలోని లొసుగుల్ని నిందితులు వాడుకుంటున్నారన్న ఆమె హృదయఘోష న్యాయదేవత చెవినపడిందో లేదో!?
నిర్భయ నిందితుల ఉరి ఎప్పుడో న్యాయస్థానమే తేల్చాలి. ఈలోపు ఇంకేమేం లొసుగులున్నాయో ఆ కిరాతకులు వెతుకుతూనే ఉంటారు. నిర్భయ నిందితులైన నలుగురిలో ఒక్క ముఖేష్‌కే ఇక మరే అవకాశం లేదు. పవన్ అనే నిందితుడు తన చివరి అవకాశాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరు కూడా చివరిదాకా ప్రయత్నించకుండా ఉండరు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎక్కడో ఉన్న నిర్భయతల్లి ఎందుకు అంతగా స్పందించిందో ఇప్పుడు అందరికీ అర్ధమవుతోంది. నిందితులు ఉరికి వేలాడినంత మాత్రాన పోయిన బిడ్డ తిరిగిరాకపోవచ్చు. కానీ ఆ కడుపుమంట కొంతైనా చల్లారుతుంది. కళ్లెదుట కనిపించే సాక్ష్యాలనే కాకుండా, గుండెలోతుల్లోని ఆవేదనను కూడా మనసుతో వినగలిగిన రోజే ఎందరో బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది.
– షఫీ