AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Bandh: రేపే భారత్ బంద్.. దేశవ్యాప్తంగా ఈ సేవలకు అంతరాయం.. వీటిని మూసివేసే ఛాన్స్

ఫిబ్రవరి 12న భారత్ బంద్ జరగనుంది. దేశవ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాలు బంద్ చేపట్టనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది. పలు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు మూతపడే అవకాశముంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల సేవలు పరిమితం కావొచ్చు.

Bharat Bandh: రేపే భారత్ బంద్.. దేశవ్యాప్తంగా ఈ సేవలకు అంతరాయం.. వీటిని మూసివేసే ఛాన్స్
Bharat Bandh
Venkatrao Lella
|

Updated on: Feb 11, 2026 | 6:00 PM

Share

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు బంద్ చేపట్టనున్నాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించింది. బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రతీఒక్కరూ బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని అన్ని రాష్ట్రాల్లోకి కాంగ్రెస్ శాఖలకు సూచించింది. దీంతో రేపు బంద్ జరగనున్న క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు పలు సేవల్లో అంతరాయం ఎదుర్కొనున్నారు. అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, మార్కెట్లు, రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశముంది. నిరసనలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు స్కూల్లు, కాలేజీలను మూసివేసే అవకాశముంది.

బంద్ ఎందుకంటే..?

కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో 29 పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా యూనియన్లు నిరసన వ్యక్తం చేయనున్నాయి. కొత్త చట్టాలు కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని, ఉద్యోగ భద్రతను తగ్గిస్తున్నానయని ఆరోపిస్తున్నారు. ఇక యజమానులు ఉద్యోగులను తొలగించడాన్ని మరింత సులభతరం చేస్తుందని విమర్శిస్తున్నారు. ప్రైవేటీకరణ, తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపు బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు అనేక బిల్లులను ఉపసంహరించుకోవడం, మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునురద్దరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నాయి. ఇక ఇటీవల యూఎస్-భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ వద్ద రైతులకు నష్టం జరగనుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లో ప్రవేశం కల్పించడం, సుంకాలు తగ్గించడం వల్ల దేశ రైతులు నష్టపోయే అవకాశముందని అంటున్నారు. దీంతో రైతు సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయని చెప్పవచ్చు.

ఈ సేవలకు అంతరాయం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలను మూసివేసే అవకాశముంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో రవాణా సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పరిమితంగా పనిచేయవచ్చు. ఇక ఆస్పత్రులు, అంబులెన్స్ లాంటి అత్యవసర సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ప్రజా సేవలు తెరిచే ఉంటాయి. అయితే నిరసనల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగొచ్చు. దీంతో వాహనదారులు ముందుగా దీనిని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చేసుకోవాలి.