ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడు! ఆపి చెక్ చేయగా షాక్..
ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 52 అరుదైన జంతువులను స్వాధీనం చేసుకున్నారు. థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న జంతువుల్లో స్పైడర్ టెయిల్డ్ వైపర్, ఆసియన్ లీఫ్ టర్టిల్, ఇండోనేషియా పిట్ వైపర్లు ఉన్నాయి.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMI)లో కస్టమ్స్ అధికారులు ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించారు. విమానాశ్రయంలో అరుదైన జంతువులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. మే 31 (ఆదివారం)న థాయ్ ఎయిర్‌వేస్ విమానం నంబర్ TG317 ద్వారా ముంబైకి చేరుకున్న ఒక భారతీయ జాతీయుడిని అరెస్టు చేశారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న తర్వాత, కస్టమ్స్ శాఖ అధికారులు నిందితుడిని విమానాశ్రయంలో ఆపి విచారించారు. ఆ సమయంలో ప్రయాణీకుడు భయంగా, అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతని లగేజీని తనిఖీ చేశారు. అధికారులు అతని బ్యాగ్ తెరిచి చూసేసరికి అందులో మొత్తం 52 అరుదైన జీవులు కనిపించాయి. అందులో కొన్ని సజీవంగా ఉంటే మరికొన్ని చనిపోయి ఉన్నాయి.
ఏ జీవులు ఉన్నాయంటే..?
స్పైడర్ టెయిల్డ్ హార్న్డ్ వైపర్ (సూడోసెరాస్టెస్ ఉరారాక్నోయిడ్స్) 3 లివింగ్ (CITES అనుబంధం-II, వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్-IVలో జాబితా చేయబడింది). ఆసియన్ లీఫ్ టర్టిల్ (సైక్లెమిస్ డెంటాటా) 5 లివింగ్ (CITES యొక్క అనుబంధం-II, వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్-IVలో జాబితా చేయబడింది). ఇండోనేషియా పిట్ వైపర్ (ట్రిమెరెసురస్ ఇన్సులారిస్) 44 (వీటిలో 43 సజీవంగా ఉన్నాయి, ఒకటి చనిపోయింది) ఇది CITES జాబితాలో చేర్చబడలేదు.
పంచనామా ప్రకారం ఆ జీవులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ప్రయాణీకుడిపై కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ప్రమేయం ఉండే అవకాశం ఉందని కస్టమ్స్ విభాగం అనుమానం వ్యక్తం చేసింది. నిందితుడైన యువకుడితో పాటు మరికొందరు కూడా ఈ పనిలో పాల్గొని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఈ జీవులను ఎక్కడి నుండి తీసుకువచ్చాడు, ఎక్కడికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
