AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Break : శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. దేశాన్ని వణికిస్తున్న మాన్సూన్ విరామం

దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా బలహీనపడ్డాయి. జూన్ 4 నుంచి 15 వరకు కురవాల్సిన వర్షపాతంలో సగం కూడా నమోదు కాకపోవడంతో దేశంలో ఏకంగా 64 శాతం వర్షాల కొరత ఏర్పడింది. ఆకాశంలో నల్లటి మేఘాలు మాయమై, క్లియర్‌గా కనిపిస్తుండటంతో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. సముద్రంలో తేమ ఉన్నప్పటికీ వానలు ఎందుకు పడట్లేదు? వాతావరణంలో చోటుచేసుకున్న ఆ అసాధారణ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.

Monsoon Break : శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. దేశాన్ని వణికిస్తున్న మాన్సూన్ విరామం
Monsoon Break In India 2026
Anand T
|

Updated on: Jun 15, 2026 | 9:17 PM

Share

నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా బలహీనపడటంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భారత వాతావరణ శాఖ గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం మాన్సూన్ ప్రభావం దేశంలో దాదాపు కనుమరుగైనట్టే కనిపిస్తోంది. జూన్ 4 నుంచి జూన్ 15 వరకు దేశంలో సాధారణంగా 53.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, అందులో సగం కూడా కురవలేదు. కేవలం 19.2 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతమే నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా వర్షాభావం 64 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశం “మాన్సూన్ విరామం” ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా రెయిన్‌ఫాల్ మ్యాప్‌ను గమనిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మధ్య భారతం, దక్షిణ భారతం, తూర్పు భారత దేశంలోని మెజారిటీ ప్రాంతాలన్నీ పసుపు, ఎరుపు రంగుల్లోకి మారిపోయాయి. అంటే ఆయా చోట్ల వర్షాలు బాగా తగ్గిపోయాయని లేదా అసలు పడటం లేదని అర్థం. జూన్ 15న ‘ఇన్‌శాట్-3డీఎస్’ ఉపగ్రహం ఫోటోలు చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో ఆకాశమంతా దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోవాలి. కానీ, ఇప్పుడు ద్వీపకల్ప భారతం, మధ్య భారత ప్రాంతాల్లో ఆకాశం అస్సలు మబ్బుల్లేకుండా పొడిగా, క్లియర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం మేఘాల కదలికలన్నీ కేవలం హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఇండో-గంగా ప్రాంతాలకే పరిమితమయ్యాయి.

వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా మధ్య భారత ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యాయి. కానీ, ఎక్కడా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. దీనికి సముద్రాల్లో తేమ కొరత కాదని, భూమికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన అసాధారణ వాతావరణ పరిస్థితులేనని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ దిశ నుంచి తూర్పు వైపు వేగంగా వీచే ‘వెస్టర్లీ జెట్ స్ట్రీమ్’ గాలులు.. ఈసారి సాధారణ స్థానం కంటే వేగంగా కిందకు అంటే దక్షిణ దిశగా జరిగాయి.

దీనివల్ల మనకు వర్షాలు తెచ్చే ‘ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్’ గాలుల పనితీరు దెబ్బతిన్నది. సాధారణంగా ఈస్టర్లీ జెట్ గాలులు వీచినప్పుడే గాలి పైకి లేచి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపు మేఘాలు తయారవుతాయి. కానీ, ఇప్పుడు బలంగా వీస్తున్న వెస్టర్లీ గాలులు ఆ మేఘాలు ఏర్పడే ప్రక్రియను పూర్తిగా నొక్కేస్తున్నాయి. ఫలితంగా సముద్రంలో తగినంత తేమ ఉన్నప్పటికీ ఆకాశంలో మేఘాలు ఏర్పడటం లేదు.

వాతావరణ నిపుణులు దీన్ని ఎగువ వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఏర్పడిన తాత్కాలిక “మాన్సూన్ విరామం”గా అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ వారాంతానికి జెట్ స్ట్రీమ్ ప్రభావం క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల మాన్సూన్ వ్యవస్థ మళ్లీ పునర్వ్యవస్థీకరించుకుని, దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు దేశంలోని చాలా ప్రాంతాలు విస్తృత వర్షాల కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us