8 Yrs of Modi Govt: 25వ తేదీన బీజేపీ కీలక సమావేశం.. భారీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్స్..!
8 Yrs of Modi Govt: భారత ప్రధాన నరేంద్ర మోదీ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మే 25వ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రధాన..
8 Yrs of Modi Govt: భారత ప్రధాన నరేంద్ర మోదీ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మే 25వ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులుతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకంలో ఈ సమావేశం జరుగనుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులకు సంబంధించి నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల హయాంలో చేసిన పనులు.. ప్రజలకు, లబ్ధిదారులకు ఎలా చేరవేయాలనేదే ఈ సమావేశం ముఖ్య ఎజెండా. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఒక్కో మంత్రికి కనీసం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను కేటాయించనున్నారు. అలాగే మే 30వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ‘సేవా, సుశాషన్, గరీబ్ కళ్యాణ్’ థీమ్‌పై బీజేపీ మోడీ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. మే 20న జైపూర్‌లో జరిగిన ఆఫీస్ బేరర్స్ మీట్‌లో ప్రభుత్వ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు.
శుక్రవారం జరిగిన సమావేశంలో మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల వేడుకలను ఎలా జరుపుకోవాలనే దానిపై మూడు తీర్మానాలు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు. కాగా, ఆయుష్మాన్ భారత్, మహిళల కోసం ఉజ్వల వంటి వివిధ పథకాలు, ‘ఇండియా ఫస్ట్’ అనే అంశంతో విదేశాంగ విధానం వంటి పలు పథకాలను తీసుకువచ్చినందున.. ప్రధాని నరేంద్ర మోదీని అత్యంత దయగల ప్రధానిగా చరిత్ర గుర్తుంచుకుంటుందని ఒక తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ సమతుల్యాన్ని ఎలా నెలకొల్పిందనే దాంతోపాటు.. జిల్లాల అభివృద్ధికి విశేష కృషి చేసిందని పేర్కొన్నారు.