AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!

ఒక మైనర్ బాలుడు ఐఫోన్ ప్రో కొనుగోలు చేయాలనే కోరికతో తన సొంత తాత ఇంట్లోనే ₹6.72 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించాడు. మహారాష్ట్రలోని యవత్మల్‌లో జరిగిన ఈ ఘటన స్మార్ట్‌ఫోన్ల పట్ల యువతలో పెరుగుతున్న మోజును, దాని దుష్పరిణామాలను స్పష్టం చేస్తోంది. పోలీసులు బాలుడిని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!
Iphone Craze Theft
Balaraju Goud
|

Updated on: Sep 04, 2026 | 1:52 PM

Share

స్మార్ట్‌ఫోన్‌ అంటే క్రేజ్‌ ఉండటం సహజమే. కానీ ఆ క్రేజ్‌ హద్దులు దాటితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మహారాష్ట్రలోని యవత్మల్‌లో వెలుగుచూసిన ఘటన చెబుతోంది. iPhone Pro కొనాలన్న కోరికతో ఓ మైనర్ బాలుడు ఏకంగా తన సొంత తాత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోని ఇనుప అల్మరాను పగలగొట్టి సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.6.72 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన యవత్మల్‌లోని కనక్‌వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. బందు బోధాలే ఇంట్లో ఆగస్టు 20-21 మధ్య రాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లోని అల్మరాలో ఉంచిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం సెప్టెంబర్ 1న వాణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గుణవంత్ అలియాస్ పొల్లార్డ్ పాండురంగ్ దానవ్ అనే 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో మైనర్ బాలుడి iPhone Pro కొనాలన్న కోరిక వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ కొనడానికి అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో ఆ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్నేహితులు అతడికి సరైన మార్గం చూపకుండా దొంగతనం చేయమని ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో మైనర్ తన తాత ఇంటినే టార్గెట్ చేసినట్లు సమాచారం.

అల్మరా పగలగొట్టి రూ.6.72 లక్షల నగలు చోరీ

తాత ఇంట్లోకి ప్రవేశించిన మైనర్.. అక్కడి ఇనుప అల్మరాను పగలగొట్టి బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 52 గ్రాముల బంగారు నగలు, వాటి విలువ సుమారు రూ.6.72 లక్షలుగా పేర్కొన్నారు. దొంగతనం చేసిన తర్వాత ఆ నగలను విక్రయించి వచ్చిన డబ్బుతో iPhone Pro కొనాలని మైనర్ భావించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. నగలను విక్రయించేందుకు నాగ్‌పూర్, చంద్రాపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

ఇద్దరు అదుపులో.. మరో వ్యక్తి కోసం గాలింపు

ఈ కేసులో మైనర్ బాలుడితో పాటు గుణవంత్ దానవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నిందితుడిగా పేర్కొంటున్న సూరజ్ గెడం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

‘ఫోన్ కావాలి’ అనే కోరిక.. చివరకు పోలీస్ కేసు

ఒక స్మార్ట్‌ఫోన్‌ కోసం తల్లిదండ్రులను అడగడం, పట్టుబట్టడం వరకు సాధారణమే. కానీ డబ్బులు లేకపోవడంతో దొంగతనానికి పాల్పడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యుల ఇంటినే లక్ష్యంగా చేసుకోవడం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది. పిల్లలు, యువతలో పెరుగుతున్న ఖరీదైన గ్యాడ్జెట్ల క్రేజ్‌పై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించకుండా ఒత్తిడికి లోనైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది.

కాగా, ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? చోరీ చేసిన నగలను ఎక్కడ విక్రయించాలనుకున్నారు? మొత్తం ఆభరణాలు పూర్తిగా రికవరీ అయ్యాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us