AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

I’m Game Movie Review: ఐమ్ గేమ్ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ ఆడిన ఆట మెప్పించిందా..?

వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. మరి ఆ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

I’m Game Movie Review: ఐమ్ గేమ్ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ ఆడిన ఆట మెప్పించిందా..?
I M Game Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 1:49 PM

Share

మూవీ రివ్యూ: ఐమ్ గేమ్

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్, జయసుధ, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ పోర్ట్, ఆంటోని వర్గీస్, కథిర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్

సంగీతం: జేక్స్ బిజాయ్

ఎడిటింగ్: చమన్ చాకో

నిర్మాత: దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్

దర్శకుడు: నహాస్ హిదాయత్

వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. మరి ఆ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) తన చదువు ముగించుకుని నాన్న కోరికపై వ్యాపారంలో అడుగుపెడతాడు. అయితే అతడికి జూదం ఆడటం మీద విపరీతమైన పిచ్చి ఉంటుంది. ఈ వ్యసనం వల్ల అప్పులపాలై, వాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్న కొడుకుని చూసి తట్టుకోలేక తల్లి మెర్సీ (జయసుధ) తను కష్టపడి కూడబెట్టిన 60 లక్షల రూపాయలను అతడికి ఇస్తుంది. కానీ డాన్ వాటిని కూడా క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి తీవ్రంగా నష్టపోతాడు. వెంటనే నిర్వాహకులను బెదిరించి ఆ నగదును లాక్కుని కారులో వేగంగా పారిపోతుండగా, ఘోర ప్రమాదానికి గురై తన కుడి చేతిని శాశ్వతంగా కోల్పోతాడు. ప్రాణాలు దక్కించుకున్న అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేసి మరొక వ్యక్తి హస్తాన్ని అమరుస్తారు.. అదే సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఇషా (కాయదు లోహర్)తో పరిచయం ఏర్పడుతుంది. అంతా సవ్యంగా జరుగుతోందని భావిస్తున్న తరుణంలో, ఆ కొత్త చేయి డాన్ నియంత్రణ తప్పి తన ఇష్టానుసారం ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. తొలుత ఆందోళన చెందినా, నెమ్మదిగా ఆ వింత పరిస్థితికి అతడు సర్దుకుపోతాడు. ఒకానొక సందర్భంలో బెట్టింగ్ కేంద్రంలో కూర్చుని మద్యం సేవిస్తుండగా, అక్కడికి డేవిడ్ (మిస్కిన్) ప్రవేశిస్తాడు. అతడిని గమనించిన వెంటనే డాన్ హస్తం ఒక కత్తిని చేతబట్టి విపరీతమైన కోపంతో డేవిడ్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, అతడు అతికష్టం మీద దాన్ని అడ్డుకుంటాడు. ఇంతకీ ఆ చేయి అసలు ఎవరిది, దానికి అంతటి శక్తి ఎలా సంక్రమించింది, డేవిడ్‌ను అది ఎందుకు అంతం చేయాలనుకుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే మిగతా చిత్ర కథ.

కథనం:

ఈ సినిమాకు ఫస్టాఫ్ అతిపెద్ద బలం. చేతికి వేరే ప్రాణం రావడం అనే కాన్సెప్ట్ ‘మావీరన్’, ‘సవ్యసాచి’ లాంటి సినిమాలను గుర్తు చేసినా సరే.. తెరపై చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దర్శకుడు యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హైదరాబాద్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చాలా డార్క్‌గా, సరికొత్త కోణంలో చూపించారు. పాన్ ఇండియా స్టార్‌డమ్ మీద వేసిన సెటైర్లు, ఇంగ్లీష్, మలయాళం, తెలుగు, తమిళ భాషల కలయికలో రాసిన సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. వేరొకరి చేయి అమర్చిన తర్వాత అది హీరో కంట్రోల్ తప్పి ప్రవర్తించే ఎపిసోడ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ఎలివేషన్స్ కూడా పెద్ద పెద్ద డైలాగులతో కాకుండా చాలా సైలెంట్‌గా వర్కౌట్ చేశారు. ఇదంతా చూసి సెకండ్ హాఫ్ అదరగొడతారు అనుకుంటే, అక్కడే అసలు నిరాశ మొదలవుతుంది. బ్రేక్ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ మొదలవగానే సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది.

దానం చేసిన వ్యక్తి గతం ఏంటో తెలిశాక, కథ ముగింపు ఎలా ఉండబోతుందో ఎవరైనా ఇట్టే ఊహించేయవచ్చు. విక్కీ పాత్ర చుట్టూ సాగే ఫ్లాష్‌బ్యాక్ చాలా సాగదీసినట్లు, రొటీన్‌గా అనిపిస్తుంది. మళ్లీ వర్తమానంలోకి వచ్చాక కూడా పాతకాలపు పగ, ప్రతీకారం ఫార్మాట్‌లోనే యాక్షన్ సీన్స్ వస్తుంటాయి. బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాల గురించి ఇచ్చిన సందేశం కూడా ఏదో బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుందే తప్ప, కథలో కలిసిపోలేదు. వర్షంలో ఒకరు చనిపోవడం, హీరో ఫైట్ అవ్వగానే విలన్‌కి కాల్ వెళ్లడం, పాత ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్… ఇలా అన్నీ మూస పద్ధతిలోనే సాగుతాయి. ఒక అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్‌లా మొదలైన సినిమా, కాస్తా చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం ప్రేక్షకుడికి కొంత అసంతృప్తిని మిగులుస్తుంది.

నటీనటులు:

మొదట పొగరున్న గ్యాంబ్లర్‌గా, ఆ తర్వాత తన చేతిని తనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయుడిగా దుల్కర్ సల్మాన్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా ఇట్టే అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. విక్కీ పాత్రలో అతిథిగా కనిపించిన ఆంటోని వర్గీస్ సినిమాకు చక్కటి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. మిస్కిన్, కదిర్, కాయదు లోహర్ తదితరుల పాత్రలకు కథలో పెద్దగా స్కోప్ లేకపోయినా.. తమ పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు. మిగిలిన వాళ్లందరూ ఓకే..

టెక్నికల్ టీం:

టెక్నికల్‌గా ఐమ్ గేమ్ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో జేక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. పాటల్లో ఎవరే నువ్వు విజువల్‌గా బాగుంది.. జిమ్షి ఖలీద్ కెమెరా పనితనం చాలా షార్ప్‌గా, సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. చమన్ చాకో ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో సినిమాను పరుగులు పెట్టించింది. దర్శకుడు నహాస్ హిదాయత్ తనకున్న మంచి కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డాడు. అద్భుతమైన ఐడియాతో కథను మొదలుపెట్టిన అతను, ద్వితీయార్థంలో మాత్రం కొత్తగా రిస్క్ తీసుకోలేక పాత ఫార్ములాతోనే సేఫ్ గేమ్‌ ఆడాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఐమ్ గేమ్.. సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..!

Follow Us