Megha Engineering: మరో ఘనత సాధించిన ‘మేఘా’.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు..

MEIL- Megha Engineering Oil Drilling Rigs: భారతదేశ ప్రముఖ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ఘనతను సాధించింది. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో

Megha Engineering: మరో ఘనత సాధించిన ‘మేఘా’.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు..
Megha Engineering Oil Drilling Rigs
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 07, 2021 | 4:03 PM

Megha Engineering Oil Drilling Rigs: భారతదేశ ప్రముఖ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ఘనతను సాధించింది. ఆయిల్ వెలికితీసే రిగ్గులను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనతను తాజాగా మేఘా ఇంజనీరింగ్ (MEIL) సొంతం చేసుకోని ఆదర్శంగా నిలిచింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారిగా ఎంఈఐఎల్ అభివృద్ధి చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కల్లోల్ చమురు క్షేత్రంలో బుధవారం ఈ డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు (మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్) ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి నాలుగువేల మీటర్ల (4 కిలో మీటర్లు) లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది.

6 వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసి నుంచి టెండర్లో దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్‌లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేశారు. మొత్తం రిగ్గుల్లో 20 వర్క్వోవర్ రిగ్గులు (వర్కోవర్ రిగ్గులు అనేవి అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణ రిగ్గులు అయితే ఈ విధంగా ఉపయోగపడవు), 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు (ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటే భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక యంత్రం. ఇది 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు తవ్వగలదు. మాములు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు) ఉన్నాయి.

20 వర్కోవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగిన 12 ఆటోమేటెడ్ వి కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి నాలుగు. మరో నాలుగు 150 ఎంటి సామర్థ్యం రిగ్గులు ఎంఈఐఎల్ తయారు చేస్తోంది. ఇక 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో ఒక్కొక్కటి 1500 హెచ్ పి సామర్థ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కాగా, ఒక్కొక్కటి 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి సామర్థ్యంతో 17 తయారవుతున్నాయి. మరో ఆరు రిగ్గులు ఒక్కొక్కటి 2000 హెచ్.పి. సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కటి 2000 హెచ్ పి. సామర్థ్యంతో మరో రెండు రిగ్గులు రూపొందిస్తున్నారు. 2000 హెచ్ పి సామ‌ర్థ్యం గ‌ల డ్రిల్లింగ్ రిగ్గులు 6 వేల మీట‌ర్ల (6 కిలో మీటర్లు) వ‌ర‌కు త‌వ్వ‌గ‌ల‌వు. ఇంత సామర్థ్యం కలిగినవి ఈ తరహా లో తొలిసారిగా భారతదేశంలో తయారవుతున్నాయి. మొత్తం 47 రిగ్గుల‌లో గుజ‌రాత్‌లో ఒక‌టి పూర్తిస్థాయిలో ఉప‌యోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్లోని రాజ‌మండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ ద‌శ‌లో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసికి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించనుంది.

అహ్మదాబాద్ సమీపంలోని కల్లోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వదేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన మొద‌టి రిగ్గు ద్వారా ప్రస్తుతం తవ్వకం ప్రారంభించినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి చెప్పారు. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్, ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రిగ్గు 1500 హెచ్‌పి సామ‌ర్థ్యంతో 4 వేల మీట‌ర్ల వ‌ర‌కు సులువుగా తవ్వుతుంది. భద్రతా ప్రమాణాల రీత్య కూడా ఇది అత్యాధునికమైనది. దేశంలో తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన తొలి రిగ్గు కావటం అందులోను భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీకి అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని రాజేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచి విదేశాల నుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ కి కూడా ఈ అధునాత‌న టెక్నాల‌జీతో రూపొందించిన రిగ్గుల ద్వారా లాభం చేకూరుతుందన్నారు.

చమురు బావులను డ్రిల్‌ చేయడం ద్వారా రాబోయే కాలంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. మేకిన్ ఇండియా నినాదాన్ని త‌న విధానంగా మేఘా మార్చుకుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. చ‌మురు, ఇంధ‌నం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్పటివరకు విదేశాల‌పైనే ఆధార‌ప‌డ్డ భార‌త్‌కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిర‌ణంగా మారిందని రాజేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రిగ్గుల త‌యారీలో విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతో రిగ్గుల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త మేఘా సొంతం చేసుకుందని.. ఇది మేఘాకే కాదు దేశం మొత్తానికి గర్వపడాల్సిన విష‌యమని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: