AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గడ్ మారణహోమానికి అసలు సూత్రధారి.. ఫ్లాన్ చేస్తే పక్కా గురి.. ఎవరీ మడవి హిడ్మా?

ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు.

ఛత్తీస్‌గడ్ మారణహోమానికి అసలు సూత్రధారి.. ఫ్లాన్ చేస్తే పక్కా గురి.. ఎవరీ మడవి హిడ్మా?
Chhattisgarh Maoist Attack Who Is Madvi Hidma Led To The Death Of Jawans
Balaraju Goud
|

Updated on: Apr 07, 2021 | 12:49 PM

Share

Maoist Madvi Hidma: అతడో వ్యూహకర్త. ఎరవేసి దాడులు చేయడంలో సిద్ధహస్తుడు.. అతడి ప్రణాళికలు ప్రత్యర్థులకు ప్రహేళికలు.. చదివింది అయిదో తరగతి.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో దిట్ట! .. అతడి వ్యూహంలో చిక్కుకుంటే సాలెగూట్లో చిక్కుకున్నట్టే! ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. ఆ చావు కూడా భయంకరంగానే ఉంటుంది. అతడికి చిక్కితే అనాయాస, సునాయస మరణాలు ఉండవు. అతడి నిఘంటువులో జాలి, దయ, కరుణ అన్న పదాలు ఉండవు. ఇప్పుడతడు దేశవ్యాప్త సంచలనం. అతడు మడవి హిడ్మా. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంలో ఇతడే కీలక సూత్రధారి. తన ఆనుపానాలపై భద్రతా దళాలకు తనే సమచారాన్ని అందించుకుని, వారికి ఎరవేసి వారి ప్రాణాలను బలిగొన్న కఠినాత్ముడు హిడ్మా. ఆ దుర్మార్గమైన ఆపరేషన్‌కు సారథ్యం వహించింది ఇతడే! మావోయిస్టు దళంలో ఇతగాడికి అత్యంత కఠినమైనవాడన్న పేరుంది. ఇతడి వ్యూహాలు ఓ పట్టాన అర్థం కావు. ప్రత్యర్థులు చిక్కితే ప్రాణం తీయాలన్నదే ఇతడి ఫిలాసఫీ!

బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా అసలు పేరు మడవి ఇడమా అయినా మడవి హిడ్మాగా స్థిరపడిపోయింది.. ఇతడికి సంతోష్‌, ఇడ్మాల్‌ , పొడియం బీమా అన్న పేర్లు కూడా ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న పువ్వర్తి గ్రామంలో పుట్టాడు హిడ్మా.. బాల్యం అంతా అక్కడే గడిచింది. అయిదో తరగతి వరకు చదివాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి దగ్గరగానే ఉంటుందీ ఊరు. 15 ఏళ్ల వయసు వరకు ఆ ఊళ్లోనే ఉన్నాడు.. అప్పటి స్థానిక పరిస్థితులు హిడ్మాను మావోయిస్టు పార్టీలో చేరేందుకు ప్రేరేపించాయి. నూనూగు మీసాల వయసులో పార్టీలో చేరిన హిడ్మా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. హిందీ, ఇంగ్లీషు భాషలలో పట్టు పెంచుకున్నాడు. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరిన ఇతగాడు దళంలో చాలామందికి ట్రైనింగ్‌ కూడా ఇస్తుంటాడు. ఇతడి స్థాయి వేరు! సాధారణ దళ సభ్యుడు ఇతడిని కలవడం అసాధ్యం. దుర్భేద్యమైన భద్రత మధ్య ఉండే హిడ్మాతో ముచ్చటించడం ఇంకా కష్టం. హిడ్మా దంపతులను అనుక్షణం కాపలా కాస్తుంటారు దళ సభ్యులు. అత్యాధునిక ఆయుధాలతో కూడిన పాతిక మంది సభ్యులు హిడ్మా దంపతులకు రక్షణ వలయంగా ఉంటారు. ఇతడికి రక్షణ కల్పించేవారిని ఎక్కువమంది అతడి దగ్గరబంధువులు, సన్నిహితులే ఉంటారు. బయటవారిని రక్షణగా పెట్టుకుంటే ఎప్పుడు ఏమవుతుందో అన్న ముందు జాగ్రత్త హిడ్మాది!

మావోయిస్టులు ఇంతకు ముందులా దాడులు చేయడం లేదు.. దాడుల్లోనూ, వ్యూహాల్లోనూ కొత్త టెక్నిక్‌ను వాడుతున్నారు. ఓ దశాబ్ద కాలం నుంచి వారి ఆపరేషన్‌లలో కూడా మార్పులు వచ్చాయి. వారు దాడి చేశారంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోవల్సిందే! ఇప్పుడు మావోయిస్టులు అనుసరిస్తున్న యుద్ధ విద్యలు ఇక్కడివేం కావు! తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో తీవ్రవాదులు అనుసరించే వ్యూహాలు ఇవి! బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ జిల్లాలలో చోటు చేసుకున్న అనేకానేక సంఘటల వెనుక వున్నది హిడ్మానే! పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ వన్‌కు కమాండర్‌గా ఉన్న హిడ్మా ప్రస్తుతం దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇతడి ఆధ్వర్యంలోనే ట్యాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ పని చేస్తుంటుంది. బీజాపూర్‌ దాడులతో హిడ్మా ఊరుకోడు.. మరిన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుని పెట్టుకునే ఉంటారు. అందుకే ఇప్పటికిప్పుడు దండకారణ్యాన్ని జల్లెడ పట్టడం మంచిది కాదన్న ఉద్దేశంతో పోలీసు వర్గాలు ఉన్నాయి. హిడ్మా కోసం వెతుకుతూ వెళితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నాయి. మావోయిస్టులకు పట్టున ప్రాంతాలకు వెళితే హిడ్మా మరో దాడికి దిగే అవకాశాలు లేకపోలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. హిడ్మా ఈ యుద్ధ విద్యలు, వ్యూహ చతురత ఎలా అబ్బి ఉంటుందన్న అనుమానం నిఘావర్గాలకు ఎప్పుడో వచ్చింది. పదేళ్ల కిందటే హిడ్మా ఫిలిప్పీన్స్‌లో ఇందుకు సంబంధించిన ట్రైనింగ్‌ తీసుకున్నాడని తెలిసింది. ఆనాటి మావోయిస్టు అధినేత గణపతి సూచన మేరకు హిడ్మా బీహార్‌ నుంచి నేపాల్‌కు, అక్కడి నుంచి దొంగ పాస్‌పోర్ట్‌తో ఫిలిప్పీన్స్‌కు చేరాడు. అక్కడే ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. భీకర దాడులు ఎలా చేయాలి? ప్రత్యర్థులను ఎలా మట్టుపెట్టాలన్న విషయాలపై ట్రైనింగ్‌ తీసుకున్నాడు. హిడ్మా వ్యూహాలు మూడు దశలలో ఉంటాయి. మొదట బాంబులతో దాడి చేస్తారు. తర్వాత తుపాకులతో కాలుస్తారు. దాడిలో ప్రాణాలతో మిగిలిన వారిపై ఏ మాత్రం కనికరం చూపరు. వారి గొంతు కోసి చంపేస్తారు. లేదా కత్తులతో హింసించి హింసించి చంపుతారు. 2010లో దంతెవాడలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఓ సైనికుడి శవంపై 78 కత్తిపోట్లు ఉండటం దీనికి నిదర్శనం. ఆపై నెలరోజుల వ్యవ ధిలో ఆర్టీసీ బస్సును పేల్చి సాధారణ ప్రజలతోపాటు 30 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చంపడ మూ హిడ్మా ఆలోచనే అన్న అనుమానాలున్నాయి.

మొన్న జరిగిన దాడికి సంబంధించిన వ్యూహాన్ని చలికాలంలోనే పన్ని ఉంటారు. బస్తర్‌ ప్రాంత మావోయిస్టులలో సుమారు 300 మంది ఇందులో పాల్గొని ఉంటారు. వారంతా షార్ప్‌ షూటర్లు. వీరికి ట్రైనింగ్‌ ఇచ్చింది హిడ్మానే! తన ప్రణాళిక ఏమిటో వారికి సవివరంగా చెప్పి ఉంటాడు హిడ్మా. దాడి చేసిన తర్వాత తప్పించుకోవడం ఎలా అన్నదానిపై మాక్‌ డ్రిల్‌ను కూడా నిర్వహించి ఉంటారు.. అంతా రెడీ చేసుకున్నతర్వాతే భద్రతా దళాలకు సమాచారం అందించి వారిని అక్కడికి రప్పించుకున్నారు. జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా సులువుగా దాడి చేసి పారిపోయారంటే వారి వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతుంది.

Read Also…  భారతీయ అత్యంత ధనవంతుల జాబితా విడుదల.. అగ్రస్థానంలో ముఖేష్, రెండో స్థానంలో అదాని