Uttar Pradesh: ఏం మనుషులు రా బాబు.. నడిరోడ్డుపై మూగజీవిని ఆటోకి తాడుతో కట్టి లాక్కెళ్తూ..
రోజురోజుకీ మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయి. సాటి మనిషితోనే కాదు.. చివరికి మూగజీవాల పట్ల కూడా కరుణ, దయ చూపడం మర్చిపోతున్నారు జనాలు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మూగజీవి అని కూడా చూడకుండా ఓ కుక్కను ఆటో వెనక భాగంలో కట్టేసి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ క్రూర సంఘటన మానవతా విలువలకే మచ్చ తెచ్చేలా ఉంది.

మూగజీవి అని కూడా చూడకుండా ఓ కుక్కను ఆటో వెనక భాగంలో కట్టేసి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని డాఢా గ్రామం సమీపంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ తన ఆటో వెనక భాగానికి ఒక కుక్కను తాడుతో కట్టేసి రోడ్డుపై లాక్కెళ్తూ వెళ్లిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనీస దయ లేకుండా ఆ మూగజీవిని ఆటో వెనక భాగంలో తాడుతో కట్టేసి లాక్కెళ్లడం జంతు ప్రేమికులను తీవ్రంగా కలిచి వేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ రిక్షా డ్రైవర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ మూగజీవి నీకు ఏం అపకారం చేసింది.. దాన్ని ఎందుకు అంత దారుణంగా లాక్కెళ్తున్నారు వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని ఊరికే వదిలి పెట్టకూడదని, వీరిని చూసి మళ్లీ ఇంకొకరు ఇలా చేయకుండా తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 5 సెకన్ల వీడియో అందరినీ కలిచివేస్తోంది. అందులో కనిపిస్తున్న దృశ్యాలు చూసేవారికి బాధ కలిగించేలా ఉన్నాయి. ఆటో వేగంగా వెళ్తూ, తాడుతో కట్టబడిన కుక్కను రోడ్డుపై లాగుతూ తీసుకెళ్లడంతో ఆ మూగజీవి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ దారుణ ఘటనను గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో పాటు ఇలా ప్రవర్తించిన ఆటోడ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
వీడియో ఆధారంగా ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతనిపై పశుసంక్షేమ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ అమానుష ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడం సరికాదని, ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి అయినా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని, ఇలా బాధ పెట్టినవారికి తగిన బుద్ధి చెప్పాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై గ్రేటర్ నోయిడా స్థానిక పోలీసు అధికారులు దృష్టి సారించారు.. ఇందుకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
