Omicron Variant: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ నుంచి కోలుకున్నాడు.. ఎక్కడంటే.!
మహారాష్ట్రలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి తాజాగా నెగటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు...
మహారాష్ట్రలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి తాజాగా నెగటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. నవంబర్ 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ముంబై వచ్చిన 33 ఏళ్ల మెరైన్ ఇంజినీర్‌కు తాజాగా జరిపిన పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్‌కు నెగటివ్ వచ్చిందని.. అతడ్ని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని కళ్యాణ్-దొంబివలి మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్యవంశీ తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామన్నారు.
సదరు వ్యక్తి ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోలేదని ఆయన తెలిపారు. కరోనా పీక్ స్టేజిలో ఉన్న ఏప్రిల్ నెలలో అతడు వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రయత్నించగా.. అప్పుడు హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రమే టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. దానితో అతడు వ్యాక్సిన్ వేసుకోకుండానే సౌతాఫ్రికా వెళ్ళాల్సి వచ్చింది.
తాజాగా అతడు తిరిగి వచ్చినప్పుడు.. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మహారాష్ట్ర హెల్త్ అధికారులు అతడి స్వాబ్ శాంపిల్స్ జీనోమ్ స్వీక్వెనింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దీనితో అతడ్ని కళ్యాణ్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించాం. తాజాగా రెండు అర్టీపీసీఆర్ టెస్టుల అనంతరం సదరు వ్యక్తికి ఒమిక్రాన్ నెగటివ్ వచ్చింది. అతడికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని కళ్యాణ్-దొంబివలి మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్యవంశీ స్పష్టం చేశారు. కాగా, మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.