Viral Video: ప్రాణాలు తీసిన ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఒక్క ఐఫోన్‌పై ఉన్న మోజు.. ఓ ఫ్యామిలీని విషాదంలోకి నెట్టేసింది. ఐఫోన్ కోసం జరిగిన గొడవలో కుమారుడితో పాటు తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. తాను కొన్న ఐఫోన్‌కు EMI కట్టేందుకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి సైతం ఈ ప్రమాదంలో మరణించగా, కొడుకు, భర్త మరణాన్ని తట్టుకోలేని తల్లి కూడా కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఐఫోన్ ఈఎమ్‌ఐ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన కుమారుడు, తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్రపతి సంభాజీనగర్ పరిధిలోని టిస్‌గావ్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. టిస్‌గావ్ గ్రామానికి చెందిన కునాల్ అనే యువకుడు ఇటీవలే EMIలో ఒక ఐఫోన్ కొన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత కునాల్‌కు EMI చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఫోన్ ఈఎమ్‌ఐ కట్టేందుకు తనకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. ఇదే విషయంపై కునాల్‌కు తన తండ్రితో గొడవ జరిగింది.
కొండపైకి వెళ్లి ఆత్మహత్యాయత్నం
ఈ గొడవ కారణంగా తీవ్ర నిరాశకు గురైన కునాల్ కోపంతో ఇంట్లో నుంచి నేరుగా వాలుజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతానికి వెళ్లాడు. అది గమనించిన తల్లిదండ్రులు కూడా అతని వెంటే వెళ్లారు. కునాల్ ఓ పెద్ద బండరాయిపై ఎక్కి తనకు ఈఎమ్‌ఐ కట్టేందుకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు.. అతను కింద పడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు.
క్షణాల్లో ముగిసిన ముగ్గురి ప్రాణాలు
ఎలాగైనా కుమారుడికి నచ్చజెప్పి కాపాడుదామని తండ్రి దగ్గరకు వెళ్లగా, బ్యాలెన్స్ కోల్పోయి ఇద్దరూ కొండపై నుంచి కింద పడిపోయారు. అప్పటికి కింద పోలీసులు ఇంకా నెట్ ఏర్పాటు పూర్తి చేయకపోవడంతో తండ్రి, కొడుకు ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కళ్ల ముందే భర్త, కుమారుడు మరణించడాన్ని తట్టుకోలేకపోయిన తల్లి కూడా అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఒక్క ఐఫోన్ వివాదం కారణంగా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు
అయితే ఈ ప్రమాద ఘటనపై స్థానిక గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. కునాల్‌కు ఎంత నచ్చ జెప్పినా వినలేదని.. తనకు కావాలంటే కొత్త ఐఫోన్ 15 ప్రోమాక్స్ ఇప్పిస్తామని కూడా చెప్పామని, నువ్వు మీ అమ్మని చూసుకోవాలి, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని చెప్పిప్పడు.. లేదు నేను నాచాలి.. ఇప్పుడు నాకు మరో మార్గం లేదని చావే శరణ్యం అని కునాల్ చెప్పినట్టు తెలిపారు. తర్వాత అతని తండ్రి నచ్చజెప్పి వెనక్కి లాగే ప్రయత్నం చేయడంతో ఇద్దరూ కిందపడి మరణించారని తెలిపారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న సంభాజీనగర్ పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
एक छोटी-सी जिद… और पूरा परिवार हमेशा के लिए चला गया।
महाराष्ट्र के छत्रपति साम्भाजीनगर में 19 साल के बेटे ने मां-बाप से मोबाइल खरीदने को कहा। मां ने कहा – बेटा अभी पैसे नहीं हैं, बाद में।
इसी छोटी बात पर नाराज होकर बेटा पहाड़ी पर चढ़ गया। गांव वालों ने फायर ब्रिगेड बुलाया,… pic.twitter.com/uTEJ68tv20
— Mandeep RajBhar (@MandeepRajBhar9) August 21, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
