AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2027కు ముందే కీలక మార్పు.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్‌గా ‘దాదా’..!

Sourav Ganguly: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కీలక మార్పు చేసింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)ను జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. హెమంగ్ బదానీ స్థానంలో గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఐపీఎల్ 2027కు ముందే కీలక మార్పు.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్‌గా 'దాదా'..!
Sourav Ganguly, Delhi Capitals
Venkata Chari
|

Updated on: Oct 06, 2026 | 3:12 PM

Share

Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2027 కోసం కోచింగ్ విభాగంలో పెద్ద మార్పు చేసింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది. ఫ్రాంచైజీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కోచింగ్ సెటప్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి గంగూలీ రావడం కొత్త పరిణామం ఏమాత్రం కాదు. క్యాపిటల్స్ ఫ్రాంచైజీలతో ఆయనకు ఇప్పటికే అనుబంధం ఉంది. 2019 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు మెంటర్‌గా పనిచేశారు. 2024లో JSWకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇటీవల 2025-26 SA20 టోర్నీలో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన గంగూలీ, తన పర్యవేక్షణలో ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ క్యాపిటల్స్ జట్టుతో కలిసి పనిచేశారు. WPLలో ఫ్రాంచైజీకి పలు ఫైనల్స్ చేరడంలో ఆయన మార్గదర్శకత్వం కీలకంగా ఉందని యాజమాన్యం భావిస్తోంది.

హెమంగ్ బదానీ విషయానికి వస్తే, ఆయనకు ఐపీఎల్‌లో క్యాపిటల్స్ ఫ్రాంచైజీపై పూర్తి బాధ్యతలు అప్పగించారు. రికీ పాంటింగ్ తర్వాత 2025 సీజన్‌కు ముందు బదానీ ఆ బాధ్యతలు చేపట్టారు. 2025లో ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. 2026 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

జట్టు ఎంపికలో స్థిరత్వం లేకపోవడం, సొంత మైదానాల్లో మ్యాచ్‌లపై పూర్తి నియంత్రణ సాధించలేకపోవడం వంటి అంశాలపై బదానీ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో 2027-28 సీజన్లకు JSW Sports యాజమాన్యం మళ్లీ క్రియాశీల నిర్వహణ బాధ్యతలు చేపట్టడం కోచింగ్ వ్యవస్థలో పూర్తి మార్పుకు దారితీసింది.

SA20లో గంగూలీ పనితీరుపై యాజమాన్యం సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే అనుభవాన్ని ఐపీఎల్‌లో ఉపయోగించుకుని ఢిల్లీ క్యాపిటల్స్ తొలి టైటిల్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us