కాసేపట్లో లవ్ మ్యారేజ్.. అంతలోనే డీజిల్ క్యాన్లతో బంధువుల ఎంట్రీ.. కట్ చేస్తే..
మహారాష్ట్రలో ప్రేమ వివాహం వివాదం పెళ్లి మండపంలో తీవ్ర ఘర్షణకు దారితీసింది. యోలా పట్టణంలో జరిగిన వివాహ వేడుకలో వరుడిపై డీజిల్ పోసి నిప్పంటించేందుకు యత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్న కోపంతో యువతి కుటుంబం కక్షగట్టింది. ప్రేమ పెళ్లిపై అసంతృప్తితో ఏకంగా వరుడిపై డీజిల్ పోసి సజీవంగా తగలబెట్టేందుకు యత్నించిన భయానక ఘటన మహారాష్ట్రలో జరిగింది. కళ్యాణ మండపంలో వధూవరుల బంధువుల మధ్య జరిగిన భీకర పోరులో 8 మందికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. నాసిక్ జిల్లా యోలా పట్టణానికి చెందిన రిషబ్ దీపక్ భగుండే, నిఫాద్ తహసీల్‌కు చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో.. సెప్టెంబర్‌లో ఇద్దరూ ఇల్లు విడిచి వెళ్లిపోయి కోర్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వివాహం తర్వాత పెద్దలను ఒప్పించి, బంధువుల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకు తగ్గట్టే యోలా నగరంలోని ఓ కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. వధూవరులు పీటలెక్కిన సమయంలోనే.. అమ్మాయి బంధువులు డీజిల్ కెన్‌లతో మండపంలోకి ఎంట్రీ ఇచ్చారు. క్షణాల వ్యవధిలో వరుడిపై, బంధువులపై డీజిల్ పోసి సజీవదహనానికి యత్నించారు. పెళ్లికి వచ్చిన అతిథులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో మండపం రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ పెళ్లి పగ ఏకంగా ప్రాణాలు తీసేంత వరకు వెళ్లిన ఘటన స్తానికంగా సంచలనంగా మారింది.
ఈ తతంగమంతా పెళ్లికి హాజరైన వ్యక్తులు తమ మొబైల్ కెమెరాల్లో రికార్డ్ చేయడంతో.. వైరల్ గా మారాయి.. సమాచారం అందుకున్న వెంటనే యోలా నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల నుంచి కేసు నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
