జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీ యత్నం.. గార్డు వేసిన స్కెచ్‌కు బెడిసికొట్టిన ప్లాన్!
మధ్యప్రదేశ్ రైసెన్ జైలులో ఓ ఖైదీ తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశాడు. గార్డును కాల్చి, కారం పొడి చల్లి పారిపోవాలని చూశాడు. గాయపడిన గార్డు ధైర్యంతో అతడిని పట్టుకోవడంతో పలాయన యత్నం భగ్నమైంది. సీసీటీవీ ఫుటేజ్ లీక్ కావడంతో జైలు భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఉన్నతాధికారుల విచారణకు ఆదేశించారు.

భోపాల్: జైలు నుంచి తప్పించుకునేందుకు ఓ ఖైదీ వేసిన పక్కా ప్లాన్ చివరి నిమిషంలో బెడిసికొట్టింది. జైలు గార్డుపై కాల్పులు జరపడంతో పాటు అతడి కళ్లలో కారం పొడి చల్లి, తాళాల కోసం వెతికిన ఖైదీని చివరకు అదే గాయపడిన గార్డు పట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా జైలులో సెప్టెంబర్ 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దాదాపు రెండు నిమిషాల సీసీటీవీ వీడియో తొమ్మిది రోజుల తర్వాత వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
హత్య, హత్యాయత్నం కేసుల్లో విచారణ ఖైదీగా ఉన్న నిలేష్ అలియాస్ ఛోటెల్ (38) జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. తొలుత అతడు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్‌తో తాళాల ఇవ్వాలంటూ బెదించాడు. కొద్దిసేపటి తర్వాత నాటు తుపాకీతో గార్డు వద్దకు వెళ్లి తాళం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గార్డు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో నిలేష్ కాల్పులు జరపడంతో దిగ్విజయ్ గాయపడి కిందపడిపోయాడు.
అయినా ఖైదీ అక్కడితో ఆగలేదు. తుపాకీతో గార్డు తలపై రెండుసార్లు కొట్టి, అతడి కళ్లలో కారం పొడి చల్లాడు. అనంతరం జైలు నుంచి బయటపడేందుకు తాళాల కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే గాయపడినప్పటికీ దిగ్విజయ్ ధైర్యం కోల్పోలేదు. నిలేష్‌ను పట్టుకోవడంతో పాటు ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిలేష్ వద్ద నుంచి నాటు తుపాకీ, నాలుగు సజీవ తూటాలు, మొబైల్ ఫోన్ లభించినట్లు పోలీసులు తెలిపారు.
ముందే పన్నిన తప్పించుకునే కుట్ర
పోలీసుల దర్యాప్తులో.. జైలు నుంచి తప్పించుకునేందుకు నిలేష్ ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు వెల్లడైంది. ఆగస్టు 19న జైలు బయట నిర్ణయించిన ప్రాంతంలోకి ప్యాకెట్ విసరడం ద్వారా .315 బోర్ నాటు తుపాకీ, ఐదు తూటలను లోపలికి చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో రాహుల్ బేడీ (27), శుభం బేడీ (26), నిలేష్ మామ సుపియార్ సింగ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాహుల్, శుభంలను పోలీసులు అరెస్ట్ చేయగా.. సుపియార్ సింగ్ పరారీలో ఉన్నాడు. జైలు సూపరింటెండెంట్ సెలవులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత సెప్టెంబర్ 2న నిలేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
CCTV బయటపడటంతో కలకలం
ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత మరో జిల్లాకు చెందిన జైలు శాఖ ఉద్యోగి విజయ్ సోషల్ మీడియాలో CCTV ఫుటేజీని పోస్ట్ చేయడంతో వీడియో బయటకు వచ్చింది. దీంతో జైలు భద్రత, CCTV ఫుటేజీ గోప్యతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ ఆర్.కె. చౌరేను సస్పెండ్ చేసి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఖైదీ తప్పించుకునేందుకు ఆయుధంతో సిద్ధమైనా.. గాయపడిన గార్డు చూపించిన ధైర్యం అతడి ప్లాన్‌ను పూర్తిగా విఫలం చేసింది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
जेल के अंदर हथियार पहुँचना कितना घातक हो सकता है. गेट पर चेकिंग में कमजोरी मुख्य कारण.
— RK Vij (@ipsvijrk) September 12, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
