AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singeetham Srinivasa Rao : మూకీ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు.. వెండితెరపై సరిహద్దులు లేని సింగీతం ప్రయోగాలు ఎన్నో..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు చేసి.. వెండితెరపై అద్భుతమైన విజయాలు సాధించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. సాంకేతిక పరిమితులు ఉన్న కాలంలోనే మాటల్లేని పుష్పక విమానం సినిమాను తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలోనే ఆదిత్య 369 వంటి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో మరో ఘతన సృష్టించారు.

Singeetham Srinivasa Rao : మూకీ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు.. వెండితెరపై సరిహద్దులు లేని సింగీతం ప్రయోగాలు ఎన్నో..
Singeetham Srinivasa Rao
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2026 | 6:41 AM

Share

కాలంతో పాటు ప్రయాణం చేయడం సహజం. కానీ, ఆ కాలాన్ని దాటి ఆలోచించడం.. అందుకు తగినట్టుగా వెండితెరపై ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన కాలాన్ని దాటిన కథకుడిగా మారారు. తన మస్తిష్కంలో మొలిచిన ఆలోచనలకు అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చి… ప్రేక్షక లోకాన్ని చివరిశ్వాస వరకు అలరించే ప్రయత్నం చేశారు సింగీతం శ్రీనివాసరావు. భారతీయ సినిమా చరిత్రలో ప్రయోగాలకు, సృజనాత్మకతకు చిరునామాగా నిలిచిన అరుదైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. కథా కథనంలో, విజువల్స్ రూపకల్పనలో ఆయన చూపించిన వైవిధ్యం భారతీయ చిత్రసీమను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్ళింది. కేవలం ఒకే రకమైన కథలకే పరిమితం కాకుండా.. మూకీ సినిమా నుండి సైన్స్ ఫిక్షన్ వరకు, జానపదాల నుండి మ్యూజికల్ ఫాంటసీల వరకు ఆయన చేయని ప్రయోగం లేదు. అందుకే ఆయన్ని భారతీయ ప్రయోగాత్మక సినిమాకి “విజనరీ ఆర్కిటెక్ట్” (రూపశిల్పి) అని పిలుస్తారు.

సింగీతం శ్రీనివాసరావు దార్శనికతకు ఉత్తమ ఉదాహరణ ‘పుష్పక విమానం’ (1987). మాటలు లేని మూకీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం పాత్రల హావభావాలు, నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి మెప్పించింది. ఇక 1991లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘ఆదిత్య 369’ దక్షిణ భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ (టైమ్ ట్రావెల్) చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. భూతకాలం, భవిష్యత్తును అనుసంధానిస్తూ ఆయన నడిపించిన కథాకథనం ఇప్పటికీ అద్భుతమే. అలాగే ‘భైరవద్వీపం’ చిత్రంతో జానపద సినిమా ప్రక్రియకు ఆధునిక సాంకేతికతను జోడించి గ్రాఫిక్స్ వింతలను వెండితెరపై ఆవిష్కరించారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘విచిత్ర సోదరులు’ వంటి చిత్రాలు కమర్షియల్ హంగులతో పాటు ప్రయోగాలకు పెట్టింది పేరుగా నిలిచాయి.

సింగీతం కేవలం దర్శకుడే కాదు.. ఆయనో రచయిత, సంగీత దర్శకుడు కూడా. నాటకరంగంలోనూ, కావ్య రచనలోనూ ఆయనకున్న పట్టు చిత్రాల్లోని ప్రతి సన్నివేశంలోనూ కనిపించేది. క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంతో వచ్చిన ‘మయూరి’ లాంటి సినిమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆయన క్రియేటివిటీ వల్ల భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది. యాభైఏళ్ల పైబడిన తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోసిన సింగీతం… ఇటీవల క్రియేటివ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో సింగ్‌ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తన 94వ ఏట కూడా వైజయంతీ మూవీస్, నాగ్ అశ్విన్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించి తన క్రియేటివిటీ ఏమాత్రం తగ్గలేదని చాటారు. మాటలు లేకుండా కేవలం పాటలు, మ్యూజిక్ ద్వారా కథ చెప్పడం ఆయనకే సాధ్యమైన మరో అరుదైన సాహసం.

తన జీవితాంతం సినిమానే శ్వాసగా బతికిన ఈ దిగ్గజ దర్శకుడు భారతీయ చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. సినీ సాంకేతికత పరిమితుల్లో ఉన్న రోజుల్లోనే తన అద్భుతమైన ఆలోచనలతో భావి తరాలకు దారి చూపిన సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులు. ఆఖరి శ్వాస వరకు.. అదే తరహాలో ముందుకు సాగిన సింగీతం… శనివాసం అనంతలోకాలకు పయనమయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

Follow Us