దేశంలో లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ తరువాత ఇండియా కూటమి నేతలు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యనేతలు హాజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. అయితే జూన్ 1న పలు రాష్ట్రాల్లో మొత్తం 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడింది.
ఈ కూటమి జూన్ 1న ఇటు తుదిదశ పోలింగ్ జరుగుతుండగా అదే రోజు శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర ముఖ్య నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అలాగే ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఆహ్వానం పంపడం, పైగా ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఈ సమావేశం ఏర్పాటు చేయడంపై దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.
జూన్ 1న ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు జూన్ 2న ముగియనుంది. కేవలం ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు 20రోజులకు పైగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ గడువు జూన్ 2తో ముగియడంతో తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జూన్ 1న ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే కేజ్రీవాల్ మే 27న తన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనారోగ్య కారణాల వల్ల మనీలాండరింగ్ కేసులో.. మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఇచ్చిన బెయిల్‌ను మరో 7 రోజులపాటు పొడిగించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్ పిటిషన్ ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఈరోజు విచారించనుంది. ఒక వేళ గడువు పొడిగిస్తే ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో సీఎం కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టీడీలో కాకుండా బయట ఉండే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఒకవేళ తమకు ఫలితాలు అనుకూలంగా వస్తే ఎలా ముందుకు సాగాలన్న దానిపై కూడా ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈ సమావేశం జరిగేందుకు సిద్దమైన తరుణంలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన భావనను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్‌మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు అంటూ స్పందించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా పతనం అయిందన్నారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా.. ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో కూడా బీజేపీ బలం సంగానికి పడిపోయిందని వ్యాఖ్యానించారు జైరాం రమేష్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…