Kolkata: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసు: నిందితుడిని బ్లూ టూత్ పట్టించింది..
కోల్‌కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు హైకోర్టు అదేశాలతో ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్‌కతాలో విచారణ చేపట్టనుంది. క్రైమ్ సీన్‌ను ఈ టీమ్ సందర్శించి ఆధారాలు సేకరించనుంది. మరో వైపు తమ డిమాండ్లన్నీ నెరవేర్చనంత వరకు నిరసనలు కొనసాగుతాయని కోల్‌కతా RG ఖర్ హాస్పిటల్ డాక్టర్లు స్పష్టం చేశారు. కోల్‌కతా డాక్టర్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు విధులు బహిష్కరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు కోల్‌కతా డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా హామీ ఇవ్వడంతో నేటి నుంచి తలపెట్టిన విధుల బహిష్కరణ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ విరమించుకుంది.
బ్లూ టూత్ పట్టించింది….
సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు 6 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. బ్లూటూత్ అతడిని పట్టించింది. నిందితుడు పొద్దున 4 గంటల సమయంలో ఆ బిల్డింగ్‌లోకి ఎంటరయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అప్పుడు నిందితుడు ఇయర్‌ఫోన్‌లు పెట్టుకున్నాడు. అయితే 40 నిమిషాల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అతని చెవుల్లో ఇయర్ ఫోన్‌లు లేవు. సెమినార్ హాల్‌లో విరిగిన బ్లూటూత్‌ను పోలీసులు గుర్తించారు. అది నిందితుడి ఫోన్‌కు కనెక్ట్ అయినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.