Independence Day: సగర్వంగా నిలుస్తున్నర మువ్వన్నెల జెండా.. జాతీయ పతాకం రూపుదిద్దుకున్నదీ.. ఇక్కడే..!
మువ్వన్నెల జెండాను చూడగానే ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగుతుంది. మూడు రంగుల జెండా గాలి సోకితేనే ఎనలేని దేశభక్తి కలుగుతుంది. అలాంటి మువ్వన్నెల జెండాను ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం.
మువ్వన్నెల జెండాను చూడగానే ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగుతుంది. మూడు రంగుల జెండా గాలి సోకితేనే ఎనలేని దేశభక్తి కలుగుతుంది. అలాంటి మువ్వన్నెల జెండాను ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం. అఖండ భారతావని సగర్వంగా నిలబడుతున్న త్రివర్ణ పతాక రూప శిల్పి మన తెలుగు బిడ్డే. భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపు దిద్దుకుంది తెలంగాణలోనే. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న రేపరెపలాడే త్రివర్ణ పతాకం ఆవిర్భవించి ఈ ఏడాదితో 77 ఏళ్లు పూర్తయ్యాయి. జాతిపిత మహాత్మాగాంధీ సూచన మేరకు జాతీయ పతాక రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మన తెలుగు వాడే. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో1876 ఆగస్టు 2న జన్మించారు. పింగళి19 ఏళ్లకే బ్రిటిష్ సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో- బోయెర్ యుద్ధం(1899-1902)లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ మహాత్మాగాంధీని కలుసుకున్నారు. బ్రిటిష్ జాతీయ పతాకానికి సైనికులు సెల్యూట్ చేసే ఘటన వెంకయ్య మదిలో నిలిచిపోయింది. స్వదేశానికి వచ్చాక స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
భారత కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి తరచూ పాల్గొనేవారు. 1906లో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్ వారి జాతీయ జెండాను కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించడం చూసి ఎంతో కలత చెందారు. మన దేశానికి ఒక జాతీయజెండా ఉండాలనే ఆవశ్యకతను గుర్తించి కాంగ్రెస్ సమావేశాల్లోనూ నొక్కి చెప్పేవారు. ఇతర దేశాల పతాకాలపైనా అధ్యయనం చేశారు. భారత జాతీయ పతాకం ఎలా ఉండాలో 30 రకాల డిజైన్లు సిద్ధం చేసి.. 1916లో “ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా” అనే బుక్‌లెట్ ప్రచురించారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం కేంద్రంగా చేసుకుని మునగాల పరగణాను జమిందార్ రాజా నాయిని వెంకట రంగారావు పాలించేవారు. నడిగూడెంలోని కోట స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదింది. జమీందార్ రంగారావుకి మిత్రుడు పింగళి వెంకయ్య. కోట కేంద్రంగా ఈ ప్రాంతంలో ఇద్దరూ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఆ సమయంలోనే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా, పౌరులను ఏకం చేసేందుకు ఒక జెండా అవసరమని గాంధీ భావించాడు.
దక్షిణ భారతదేశంలో ప్రియ శిష్యుడుగా ఉన్న పింగళి వెంకయ్యను జాతీయ జెండాను రూపొందించాలని గాంధీ కోరాడు. నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులతో తయారు చేసి మధ్యలో మహాత్మా గాంధీకి ఇష్టమైన నూలువడికే రాట్నం ఉంచారు. 1926లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది. అప్పటికే దేశం నలుమూలల నుండి 16 నమూనాలు వచ్చాయి. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో చిన్న మార్పులు చేసి రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు మహాత్మా గాంధీ. 1947లో స్వాతంత్య్రం సిద్ధించాక బాబూ రాజేంద్రప్రసాద్ సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది. భారత రాజ్యాంగ సభ జూలై 22, 1947న ఆమోదించింది. అలా జాతీయ జెండా రూపకల్పన ప్రాంతంగా నడిగూడెం కోటకు కీర్తి దక్కింది.
పింగళి వెంకయ్య జాతీయోద్యమ సేవలకు గుర్తింపుగా 2009 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.5 తపాలా బిళ్ళను విడుదల చేసింది. చారిత్రక ఘటనకు వేదికైన ఆనాటి ఈ రాజ భవనం నేడు మాత్రం పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. అత్యంత విశిష్టత కలిగిన ఈ కోటను స్వాధీనం చేసుకుని బావి తరాలకు అందించాలని, నడిగూడెం కోటను టూరిస్టు కేంద్రంగా మార్చాలని స్థానికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..