Kishan Reddy: ఇది ఆకస్మిక నిర్ణయం కాదు.. కుల గణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
Kishan Reddy: దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. జనాభా లెక్కలతో పాటే కులగణన చేస్తామని ప్రకటించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలని నిర్ణయించారని కేంద్రం తెలిపింది..

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కుల గణన నిర్వహించాలనే ప్రభుత్వం నిర్ణయంపై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటన చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలని నిర్ణయించారని అన్నారు. ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, చాలా చర్చల తర్వాత తీసుకున్న నిర్ణయమని అన్నారు.
సెప్టెంబర్ 18, 2024న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనాభా లెక్కింపు ప్రకటన సమయంలో ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం సమాజంలోని ఏ వర్గంలోనూ ఒత్తిడిని కలిగించకుండా సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లను ప్రవేశపెట్టినప్పుడు, తమ ప్రభుత్వం సమాజం, దేశం విలువలు, ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఇది నిరూపిస్తుందన్నారు.
1881-1931 మధ్య జరిగిన దశాబ్ద జనాభా లెక్కల్లో అన్ని కులాలను లెక్కించగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 1951 జనాభా లెక్కల్లో కులాలను లెక్కించకూడదని ఆదేశించిందని, అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కుల గణనను వ్యతిరేకిస్తూనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ, దాని INDI కూటమి భాగస్వాములు కుల గణనను రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నారని, వారి ఉద్దేశ్యం సామాజిక న్యాయం లేదా మెరుగైన పరిపాలన లక్ష్యంతో కాదని ఆరోపించారు.
2010లో అప్పటి ప్రధానమంత్రి దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ కుల గణన అంశాన్ని క్యాబినెట్‌లో పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి.. పార్లమెంటులో ఆమోదించబడిన ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ మద్దతు ఇచ్చిందని మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనకు బదులుగా కేవలం ఒక సర్వేను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిందని, సామాజిక ఆర్థిక కుల గణన – 2011 (SECC-2011) అని పిలిచే ఆ సర్వే పేలవమైన ప్రణాళిక, అసమర్థ అమలు కారణంగా చాలా ఘోరంగా విఫలమైందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




