కేరళలోని ఇడుక్కిలో మృతదేహాల వెలికితీతకు రాడార్
కేరళ ఇడుక్కి జిల్లాలోని పెట్టుముడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య 58 కి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాల్లో..
కేరళ ఇడుక్కి జిల్లాలోని పెట్టుముడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య 58 కి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాల్లో మూడింటిని ఆదివారం వెలికి తీశారు. మరిన్ని డెడ్ బాడీలను వెలికి తీసేందుకు సహాయక బృందాలు నానా అగచాట్లు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మృత దేహాల వెలికితీతకు చెన్నై నుంచి ‘గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్’ ను తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని, లేదా మృత దేహాలను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రత్యేకమైన రాడార్ ని వినియోగించబోవడం ఇదే మొదటిసారి.
ఈ దుర్ఘటనకు సంబంధించి ఇంకా 12 మంది ఆచూకీ తెలియడంలేదు భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడంతో, రేకులు, యాస్బెస్టాస్ షీట్లతో నిర్మించిన ఇళ్ళు కూలిపోయాయి. సుమారు 87 మంది ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. ఇప్పటికీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ సభ్యులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యే ఉన్నారు.