Kerala: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. యూనివర్సిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ తొలగింపు.. దక్షిణాదిలో..
కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం మధ్య ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం మధ్య కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ బాధ్యతల నుంచి గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సాంస్కృతిక కళా రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని నియమించేలా విశ్వవిద్యాలయ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆరోపణలు గుప్పించింది. గవర్నర్‌ను ఛాన్సలర్‌గా తొలగించేందుకు UGC నిబంధనలను అనుసరరించిందని.. దాని ప్రకారమే కేరళ కళామండలం విశ్వవిద్యాలయం నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించిందని అధికారులు తెలిపారు
కాగా.. ఇటీవల కేరళలోని 11 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను వీసీలు నిరాకరించారు. దీంతో పదవుల నుంచి ఎందుకు తొలగించకూడదో.. వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ వీసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ సానుభూతిపరులకు వైస్ ఛాన్సలర్ పదవులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ వామపక్ష నేతలకు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గవర్నర్‌కు ఇలా ఆదేశాలిచ్చే అధికారాల్లేవని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత గవర్నర్ ఖాన్.. కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్‌ను పదవి నుంచి తొలగించాలంటూ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజ్‌భవన్ వేదికగా బీజేపీ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ను డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
దక్షిణాదిలో ముదురుతున్న వివాదం..
ఇటీవల కాలంలో దక్షిణాదిలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, తెలంగాణ, కేరళలో గవర్నర్లు, ఆయా రాష్ట్రప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. తమిళనాడు గవర్నర్‌గా ఆర్.ఎన్ రవిని తొలగించాలంటూ అధికార డీఎంకే పార్టీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆరిఫ్ ఖాన్ తీరుపై కేరళ ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
అంతేకాకుండా తెలంగాణలో కూడా గవర్నర్, ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..