AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Story: క్రైమ్..పాలిటిక్స్.. కేరళ కహానీ.. చిక్కుల్లో సీఎం పినరయి విజయన్ ?

కేరళలో ఓ 'ఉన్నత స్థాయి క్రైమ్.. దీనితో ముడి పడిన రాజకీయం..  రెండూ కలిసి సీఎం పినరయి విజయన్ ని చిక్కుల్లో పడేట్టు చూస్తున్నాయి. తనకు తెలిసో, తెలియకో ఆయన ఓ స్కాండల్ లో ఇరుక్కున్నారు. ఆయనతో బాటు..

Big Story: క్రైమ్..పాలిటిక్స్.. కేరళ కహానీ.. చిక్కుల్లో సీఎం పినరయి విజయన్ ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 07, 2020 | 3:00 PM

Share

కేరళలో ఓ ‘ఉన్నత స్థాయి క్రైమ్.. దీనితో ముడి పడిన రాజకీయం..  రెండూ కలిసి సీఎం పినరయి విజయన్ ని చిక్కుల్లో పడేట్టు చూస్తున్నాయి. తనకు తెలిసో, తెలియకో ఆయన ఓ స్కాండల్ లో ఇరుక్కున్నారు. ఆయనతో బాటు తనకు సన్నిహితుడు, విశ్వాస పాత్రుడు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎం.శివశంకర్ కూడా ట్రబుల్స్ లో పడడం  కేరళలో దుమారం సృష్టిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ లో మాజీ ఉద్యోగిని అయిన  స్వప్న సురేష్ ని ‘రక్షించడానికి’ శివశంకర్ యత్నించారని, గల్ఫ్ నుంచి సుమారు 30 కేజీల బంగారాన్ని స్మగుల్ చేసేందుకు స్వప్న తన ‘దౌత్య’ పదవిని వినియోగించుకుందని తెలుస్తోంది. ఇందుకు ఆమె కాన్సులేట్ కి సంబంధించిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిందట. ఆమెకు గల క్రైమ్ సిండికేట్ తో శివశంకర్ కి కూడా లింక్ ఉన్నట్టు చెబుతున్నారు.

కేరళ స్టేట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గల స్పేస్ పార్క్ సంస్థ లో ‘ఆపరేషన్స్ మేనేజర్’ గా ఈమెను నియమించడం వెనుక శివశంకర్ హస్తం ఉందని భావిస్తున్నారు. కాగా… బంగారం స్మగ్లింగ్  రాకెట్ లో  స్వప్న సురేష్ ప్రమేయం ఉన్నట్టు కస్టమ్స్ శాఖ గుర్తించడంతో ఐటీ శాఖ ఆమెను తొలగించింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. కస్టమ్స్ అధికారులు నిన్న ఆమె ఇంటిలో కొన్ని గంటలపాటు సోదాలు చేశారు. స్వప్న పై క్రైమ్ బ్రాంచ్ కేసు ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆమెకు ఉన్నతోద్యోగం ఇవ్వడం వివాదాస్పదం కాగా-అసలు తనకీ విషయమే తెలియదని సీఎం పినరయి విజయన్ చెప్పడం విశేషం. ఆమెకు ఈ పదవి ఎలా దక్కిందో తెలుసుకుంటానని ఆయన ముక్తసరిగా చెబుతున్నారు.

అయితే ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే స్వప్న తరఫున కస్టమ్స్ కార్యాలయానికి ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆరోపిస్తున్నారు. ఐటీ కార్యదర్శి శివశంకర్ స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్టు వారు పేర్కొంటున్నారు. కానీ విజయన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఒక సందర్భంలో విజయన్ తో కలిసి స్వప్న సురేష్ నడుస్తున్న ఫోటోను రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ట్వీట్ చేశారని, అయితే ఆ తరువాత దాన్ని డిలీట్ చేశారని తెలిసింది. అసలది ఆయన చేసిన ట్వీటేనా లేక మరెవరైనా చేశారా అన్నది తెలియలేదు.

తాజాగా శివశంకర్ ని రాజీనామా చేయాల్సిందిగా విజయన్ కోరారని తెలుస్తోంది. తాను కూడా దౌత్య మార్గాలను వినియోగించుకుని గోల్డ్ స్మగ్లింగ్ కి దిగినట్టుభావిస్తున్న శివశంకర్ ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నించవచ్ఛునని అంటున్నారు. ఇక స్వప్న సురేష్ కథ ఇక్కడితో ముగియలేదు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలనుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడే ముఠాతో కూడా ఈమెకు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల షామ్నా కాసిం (పూర్ణ) అనే నటి కుటుంబం నుంచి ఈ గ్యాంగ్ బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఆ కేసులో ఎనిమిది మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.  తిరువనంతపురంలో స్వప్న కోట్లాది రూపాయల ఖర్చుతో విలాసవంతమైన భవనం నిర్మిస్తోందట. ఈమె ఆధ్వర్యంలోని గ్యాంగ్ మరో 8 మంది మోడల్స్ ని కూడా బెదిరించి.. బ్లాక్ మెయిల్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది.