Uttarakhand: కేదార్‌నాథ్‌కు వెళ్తున్నహెలికాప్టర్ రోడ్డుపై అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణీకులు సురక్షితం..
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదార్‌నాథ్ ధామ్‌కు పయనం అవుతారు. యాత్రలో అతి కష్టమైనా ఈ యాత్రను చేసేందుకు భక్తులు కొందరు కాలినడకని ఆశ్రయిస్తే.. మరికొందరు హెలికాప్టర్ ని ఎంచుకుంటున్నారు. ఇలా ఈ రోజు కేదార్‌నాథ్ కి వెళ్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పైలట్ రోడ్డుపైనే అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

ఉత్తరాఖండ్ లో ఛార్ ధామ్ యాత్ర కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు ఈ యాత్రను చేసేందుకు.. రుద్రప్రయాగ్ కు చేరుకుంటున్నారు. ఈ రోజు కేదార్‌నాథుడిని దర్శించేందుకు కేదార్‌నాథ్ ధామ్ కి హెలికాప్టర్ ద్వారా భక్తులు వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎమర్జెన్సీగా లాండ్ అయింది. జిల్లాలోని బదాసు ప్రాంతంలో కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా రోడ్డుపై ల్యాండ్ అయింది. హెలికాప్టర్ భక్తులతో కేదార్‌నాథ్ ధామ్ వైపు వెళుతుండగా.. దారిలో అత్యవసర పరిస్థితి కారణంగా.. పైలట్ స్మార్ట్ గా ఆలోచించి బదాసు సమీపంలోని రోడ్డుపై హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలన అధికారులు, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. హెలికాప్టర్ లో ఉన్న ప్రయాణీకులను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. హెలికాప్టర్ క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందినదని తెలుస్తోంది. కేదార్‌నాథ్‌కు వెళ్లే బదాసు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌లో పైలట్ , కో-పైలట్ లతో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. కో-పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
సిర్సి నుంచి ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ ముందు జాగ్రత్త చర్యగా హెలిప్యాడ్‌కు బదులుగా రోడ్డుపై ల్యాండ్ అయిందని సీఈఓ ఉకాడ సోనికా తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. డీజీసీఏకు సమాచారం అందిందని చెప్పారు. అంతేకాదు మిగిలిన హెలికాప్టర్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సాధారణంగా జరుగుతున్నాయని తెలిపారు.
గత నెలలో కూడా ఒక హెలికాప్టర్ ప్రమాదం
గత నెలలో కూడా కేదార్‌నాథ్ ధామ్‌లో ల్యాండ్ అవుతుండగా హెలి అంబులెన్స్ కూలిపోయింది. హెలి అంబులెన్స్ రిషికేశ్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న రిషికేశ్ ఎయిమ్స్‌కు చెందినది. మే 8న గంగోత్రి ధామ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ గంగానై సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు పైలెట్ సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గంగానిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం చాలా భయంకరమైనది. అక్కడ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఈ సంఘటనలో హెలికాప్టర్ రెండు ముక్కలుగా విరిగిపోయిందని చెప్పారు. హెలికాప్టర్‌లో రెండు మృతదేహాలు చిక్కుకున్నాయని వాటిని బయటకు తీయడానికి హెలికాప్టర్‌ను కత్తిరించాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 200 మీటర్ల లోతున ఉన్న గుంటలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం చాలా కష్టతరమైన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..