‘ఆధ్యాత్మికత పేరిట నిధుల వసూళ్లా’? జగ్గీ వాసుదేవ్‌కు కోర్టు ‘ప్రశ్న’
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ‘ ఈషా ఫౌండేషన్ ‘ పై కర్ణాటక హైకోర్టు ‘ సందేహాత్మక ‘ వ్యాఖ్యలు చేసింది. కావేరీ నదీ జలాల పరిరక్షణ..(కావేరీ కాలింగ్) పేరిట రైతుల నుంచి ఎంత సొమ్ము వసూలు చేశారో తెలియజేయాలని, ఇందుకు సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. చీఫ్ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ హేమంత్ చందన్ గౌడార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు సూచిస్తూ.. ఆధ్యాత్మిక విషయాలు కూడా […]
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ‘ ఈషా ఫౌండేషన్ ‘ పై కర్ణాటక హైకోర్టు ‘ సందేహాత్మక ‘ వ్యాఖ్యలు చేసింది. కావేరీ నదీ జలాల పరిరక్షణ..(కావేరీ కాలింగ్) పేరిట రైతుల నుంచి ఎంత సొమ్ము వసూలు చేశారో తెలియజేయాలని, ఇందుకు సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. చీఫ్ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ హేమంత్ చందన్ గౌడార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు సూచిస్తూ.. ఆధ్యాత్మిక విషయాలు కూడా చట్టానికి లోబడే ఉంటాయని పేర్కొంది. ‘
అసలు ఆధ్యాత్మికత పేరిట మీరు చేస్తున్నదేమిటి ? లాభాపేక్ష లేని సంస్థ మాది కనుక చట్టానికి మేం అతీతులమన్న భావనలో ఉండకండి..సొమ్ము సేకరించడానికి రాష్ట్రం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ మీకు అధికారమివ్వలేదు.. ఏ అధికారం కింద మీరు రైతులనుంచి నిధులు సేకరిస్తున్నారు ? మీది రిజిస్టరయిన సంస్థ కూడా కాదు.. ఏ చట్టం కింద, ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు ‘ ? అని న్యాయమూర్తులు ఈ సంస్థ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. నదీ జలాల పరిరక్షణ కోసం మీరు చేబట్టిన కార్యక్రమం మంచిదే అయినా బలవంతంగా నిధులు సేకరించరాదని కోర్టు సుతిమెత్తగా చురకలు వేసింది. ఈషా ఫౌండేషన్ వసూలు చేస్తున్న నిధులు, ఈ తీరును ప్రశ్నిస్తూ.. ఎ.వి. ఆనంద్ అనే అడ్వొకేట్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు విచారించారు. ఈ సంస్థ ప్రజలు, రైతుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణా జరపడంలేదని రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదూ అందలేదని ప్రభుత్వం తరఫు లాయర్ తెలిపారు. కాగా–ఈ పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 12 కు వాయిదా వేసింది.