Health Astrology: సంక్రాంతి నుంచి వారికి ఆరోగ్య సమస్యలు జాగ్రత్త..! పరిహారం ఏమంటే..?
జనవరి 15 నుంచి ఫిబ్రవరి 13 వరకు రవి మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశులవారికి ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాల పరంగా కొన్ని ఇబ్బందులను సృష్టిస్తుంది. ఈ ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమ పరిష్కారం.

Sankranti Health Astrology
ఈ నెల (జనవరి) 15 నుంచి ఫిబ్రవరి 13 వరకు మకర రాశిలో గ్రహ రాజు రవి సంచారం చేయడం జరుగుతోంది. మకర రాశిలో సంచారం వల్ల రవి అయిదు రాశులవారిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం, అధికారం, తండ్రి, ప్రభుత్వం, రాజకీయాలకు కారకుడైన రవి దుస్థానాల్లో సంచారం చేయడం వల్ల మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశులవారికి ఈ విషయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతర గ్రహాల అనుకూలతల వల్ల వీరికి పెద్దగా నష్టం జరగకపోవచ్చు. వీరు సంక్రాంతితో ప్రారంభించి ప్రతి రోజూ ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
- మిథునం: ఈ రాశికి రవి అష్టమ స్థానంలో సంచారం చేయబోతున్నందువల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అతిగా శ్రమపడకపోవడం, ఆవేశపడకపోవడం, ఉద్రేకం చెందకపోవడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు. హామీలు కూడా ఉండవద్దు. అధికారులతోనే కాక, తండ్రితో కూడా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల హృద్రోగ సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చివరి క్షణంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గృహ, వాహన సంబంధమైన వ్యవహారాల్లో మోసపోవడం జరుగుతుంది.
- సింహం: రాశ్యధిపతి రవి షష్ట స్థాన సంచారం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. రావలసిన సొమ్ము, కష్టార్జితం సకాలంలో చేతికి అందక ఇబ్బందులు పడడం జరుగుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తండ్రితో అకారణ వైరాలు తలెత్తుతాయి. అనారోగ్యాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు ఒత్తిడి తీసుకువస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. అధికారులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో నష్టపోవడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల సోదరులతో కలహాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి గానీ, సహచరుల నుంచి గానీ సహాయ సహకారాలు అందకపోవచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రతి పనికీ ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు చేజారిపోతాయి. ప్రయాణాల్లో విలువైన పత్రాలు, వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. దుర్వార్తా శ్రవణం ఉంటుంది.
- కుంభం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు, విభేదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగంలో ప్రాభవం కోల్పోవడం జరుగుతుంది. అనవసర పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యసనాలు, విలాస జీవితం మీద ఖర్చు పెరుగుతుంది. అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రయాణాలు సాఫీగా సాగకపోవచ్చు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దుర్వార్తలు ఎక్కువగా వింటారు.
Follow Us