Karnataka Polls 2023: ఎన్నికల బరిలోకి దిగనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే.. లిస్టులో డాక్టర్లు, మాజీ ఉన్నతాధికారులు..
కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉండగా.. ఆయా స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగబోయే 189 మంది అభ్యర్థులను అధికార బీజేపీ ప్రకటించింది. అయితే ఈ 189 మందిలో దాదాపు 52 మందికి కొత్తగా అవకాశం లభించడం విశేషం. ఇంకా వారిలో 8 మంది మహిళలు కూడా ఉండడం గమనార్హం. కన్నడ రాష్ట్రంలో..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉండగా.. ఆయా స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగబోయే 189 మంది అభ్యర్థులను అధికార బీజేపీ ప్రకటించింది. అయితే ఈ 189 మందిలో దాదాపు 52 మందికి కొత్తగా అవకాశం లభించడం విశేషం. ఇంకా వారిలో 8 మంది మహిళలు కూడా ఉండడం గమనార్హం. కన్నడ రాష్ట్రంలో కొత్త నాయకత్వం అభివృద్ధి చెందాలని భావించిన బీజేపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 189 మంది బీజేపీ అభ్యర్థులలో 32 మంది ఓబీసీలు, 30 మంది ఎస్‌సీలు అలాగే 16 మంది ఎస్‌టీలు ఉన్నారు. అలాగే ఈ లిస్టులో 9 మంది డాక్టర్లు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎల్ అధికారులతో పాటు, మొత్తం 31 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్‌కు కూడా బీజేపీ పార్టీ నుంచి అవకాశం లభించింది.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శిగ్గావ్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అలాగే కర్ణాటక మాజీ సీఎం, సీనియర్ నేత యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర.. తన తండ్రి స్థానమైన శికారీపుర నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్ర మంత్రి, మరో సీనియర్ నేత బీ శ్రీరాములు బళ్లారి గ్రామీణం నుంచి పోటీ పడనున్నారు. చిక్కబళ్లాపుర నుంచి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, మల్లేశ్వరం నుంచి మంత్రి అశ్వత్నారాయణ్ బరిలోకి దిగనున్నారు. మరో మంత్రి ఆర్ అశోక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ వెల్లడించింది. పద్మనాభనగర్, కనకాపుర నుంచి ఆయనను బరిలోకి దించుతున్నట్లు బీజేపీ తన అభ్యర్థుల జాబితాలో పేర్కొంది. అలాగే ఈ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్మి సీటీ రవి కూడా తన సిట్టింగ్ స్థానమైన చిక్మగలూర్ నుంచి పోటీ చేయనున్నారు.
A look at @BJP4Karnataka‘s list of 189 candidates for Karnataka Assembly Elections:
52 new faces 32 OBC candidates 30 SC 16 ST 9 Women 5 Advocates 2 Retired Officers
Only the BJP ensures equitable & universal representation.
Best wishes!#BJPYeBharavase pic.twitter.com/md3dDXK56I
— Tejasvi Surya (@Tejasvi_Surya) April 11, 2023
కాగా, గత ఎన్నికల సమయం(2018)లో కాంగ్రెస్ తరఫున గెలిచి కూడా, ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం సహకరించినవారు కొందరు ఉన్నారు. ఇక ఆ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ సారి బీజేపీ పార్టీ నుంచి టికెట్లు లభించాయి. అయితే ఈ 189 బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు దాదాపు మూడు రోజుల పాటు ఉన్నత స్థాయి చర్చోపచర్చలు జరిగాయి. ఇక 224 శాసనస్థానాల కోసం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల అంటే మే 12న జరగనున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాలు మే 15న విడుదల కానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..