AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda: అది వాళ్ల వ్యక్తిగతం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు! జేపీ నడ్డా కీలక ప్రకటన!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. ఇవి వారి వ్యక్తిగత ప్రకటనలు..బీజేపీ అలాంటి ప్రకటనలతో ఏకీభవించదు, అలాంటి ప్రకటనలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుందని ఆయన అన్నారు.

JP Nadda: అది వాళ్ల వ్యక్తిగతం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు! జేపీ నడ్డా కీలక ప్రకటన!
Bjp
Gopikrishna Meka
| Edited By: Anand T|

Updated on: Apr 20, 2025 | 11:56 AM

Share

న్యాయవ్యవస్థపై, దేశ ప్రధాన న్యాయమూర్తిపై బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన ప్రకటనలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. ఇవి వారి వ్యక్తిగత ప్రకటనలు..బీజేపీ అలాంటి ప్రకటనలతో ఏకీభవించదు, అలాంటి ప్రకటనలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుందని ఆయన అన్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఎంపీలెవరూ న్యాయవ్యవస్థ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించారు. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ ఎక్కడ మాట్లాడవద్దని సూచించారు.

న్యాయ వ్యవస్థలపై నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు..

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు కాలపరిమితి విధించడాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తప్పు పట్టారు. దేశంలో మత యుద్ధాలను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టే కారణం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..ఈ దేశంలో జరుగుతున్న అన్ని అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలన్నారు. సుప్రీంకోర్టు తన పరిమితులను మించి పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి దానికీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ మూసివేయాలన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. నియామక అధికారికి సుప్రీంకోర్టు ఎలా దిశానిర్దేశం చేస్తుందని ప్రశ్నించారు? ఈ దేశానికి పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తుంది. పార్లమెంటును సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుందని ప్రశ్నించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఉంది? సుప్రీంకోర్టు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు.

న్యాయ వ్యవస్థలపై దినేష్ శర్మ వ్యాఖ్యలు…

శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ సైతం స్పందించారు. రాజ్యంగంలో శాసనసభ, న్యాయవ్యవస్థ హక్కులు స్పష్టంగా వ్రాయబడ్డాయని.. భారత రాజ్యాంగం ప్రకారం, ఎవరూ లోక్‌సభ , రాజ్యసభను నిర్దేశించలేరని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఇప్పటికే వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతిని ఎవరూ సవాలు చేయలేరు, ఎందుకంటే రాష్ట్రపతి సుప్రీం అని ఆయన చెప్పుకొచ్చారు.

బీజేపీ ఎంపీల వ్యాఖ్యలపై విపక్షాల మండిపాటు..

సుప్రీంకోర్టు, సీజేఐపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఖండించారు. బీజేపీ ఎంపీలు న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది కోర్టు ధిక్కారం, రాజ్యాంగ ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై పార్లమెంటు సభ్యుడు తీవ్రమైన ఆరోపణలు చేశారని.. దీన్ని తేలికగా తీసుకోకూడదని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని.. న్యాయవ్యవస్థపై బీజేపీ ప్రత్యక్ష దాడికి నిదర్శనం అన్నారు. న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పోయేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిషికాంత్ దూబే పై స్పీకర్, కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….