జైల్లో ఉన్నా పీఎం, సీఎం పదవి పోనట్లేనా? రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ సంచలన సిఫార్సులు!
దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కీలక సవరణలను సూచించింది. తీవ్ర నేరారోపణలపై అరెస్ట్ అయి, వరుసగా 30 రోజుల పాటు జుడీషియల్ కస్టడీలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను నేరుగా పదవి నుంచి తొలగించడం కంటే, వారి పదవులను సస్పెన్షన్‌లో ఉంచడమే సరైనదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కీలక సవరణలను సూచించింది. తీవ్ర నేరారోపణలపై అరెస్ట్ అయి, వరుసగా 30 రోజుల పాటు జుడీషియల్ కస్టడీలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను నేరుగా పదవి నుంచి తొలగించడం కంటే, వారి పదవులను సస్పెన్షన్‌లో ఉంచడమే సరైనదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన డ్రాఫ్ట్ నివేదికలో ఈ మేరకు 5 ముఖ్యమైన సవరణలను సూచించినట్లు తెలుస్తోంది. వివాదాస్పదమైన బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు 31 మందితో కేంద్రం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ జూలై 17న సమావేశమై తమ తుది నివేదికను కేంద్రానికి సమర్పించబోతోంది.
కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం.. 30 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్ రాని ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్‌గా తమ పదవులను కోల్పోతారు..అయితే దీనిపై వివిధ చట్టపరమైన విశ్వవిద్యాలయాలు, పౌర సమాజాల నుంచి అభిప్రాయాలు సేకరించిన కమిటీ తొలగింపు లేదా పదవి కోల్పోవడం అనే పదాలు సదరు వ్యక్తిపై కోర్టులో నేరం నిరూపణ కాకముందే ఒక రకమైన నిందను మోపుతాయని అభిప్రాయపడింది. అరెస్ట్ అనేది కేవలం దర్యాప్తు ప్రక్రియలో భాగమే తప్ప, అది కోర్టు ఇచ్చే శిక్ష కాదని కమిటి భావించింది.
రాజకీయ దుర్వినియోగం కాకుండా చెక్!
కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED ద్వారా ప్రతిపక్ష నేతలను, విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను కావాలనే టార్గెట్ చేసి, 30 రోజుల పాటు జైల్లో ఉంచి వారి ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఈ బిల్లును అస్త్రంగా వాడుకునే ప్రమాదం ఉందంటూ విపక్షాలు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జేపీసీ ప్రతిపాదించిన సస్పెన్షన్, ఆటోమేటిక్ రివర్సల్ నిబంధనలు రాజకీయ కక్షసాధింపు చర్యలకు అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. జైలు నుంచి పాలన సాగించడాన్ని నిరోధించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని సమర్థిస్తూనే.. ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినకుండా కమిటీ ఈ సమతుల్య మార్పులను సూచించింది.
జేపీసీ (JPC) కీలక సిఫార్సులు !
30 రోజుల జైలు కాలం తర్వాత సదరు ప్రజాప్రతినిధి విధుల నుంచి తప్పుకోవాల్సిందే (పదవి వీడాల్సిందే), కానీ అది తొలగింపు రూపంలో కాకుండా తాత్కాలిక సస్పెన్షన్ రూపంలో ఉండాలి.
ఆటోమేటిక్ రివర్సల్ !
ఒకవేళ సదరు ప్రజా ప్రతినిధి కోర్టు ద్వారా నిర్దోషిగా తేలినా, కేసు నుంచి డిశ్చార్జ్ అయినా లేదా నిర్దేశిత గడువులోగా ప్రాసిక్యూషన్ విచారణను ముందుకు తీసుకెళ్లలేకపోయినా.. వారిపై ఉన్న సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా రద్దు అయ్యి, తిరిగి సదరు నేతకు అదే పదవి లభిస్తుంది.
తీవ్రమైన నేరాల నిర్వచనం !
5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలను మాత్రమే తీవ్రమైన నేరాలుగా పరిగణించాలి.
ప్రత్యేక షెడ్యూల్ !
ఈ చట్టం ఏయే నిర్దిష్ట నేరాలకు వర్తిస్తుందో స్పష్టం చేస్తూ ఒక ప్రత్యేక షెడ్యూల్ (లిస్ట్) ను బిల్లులో చేర్చాలి.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు..!
ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను అత్యంత వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి.
వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు!
జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ కమిటీ నివేదిక పార్లమెంట్ ముందుకు రానుంది. కమిటి సిఫారసులను కేంద్రం పరిశీలించి సవరణలు చేసి ఈ బిల్లును పార్లమెంట్ వర్షాల సమావేశాల్లోనే ఆమోదించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
