AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenin Review: అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా..?

Lenin Review: అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా..?

Phani CH
|

Updated on: Jul 10, 2026 | 8:08 PM

Share

అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మహాభారతం స్ఫూర్తితో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. బలమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలు, అఖిల్ కెరీర్‌లోనే అత్యుత్తమ నటన సినిమాకు ప్రధాన బలాలు. కొన్ని లాజిక్ లోపాలు ఉన్నప్పటికీ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. థమన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ వారం థియేటర్స్‌లోకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో అందరి ఫోకస్ ఉన్నది మాత్రం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మీదే.. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో.. భారతం లాంటి కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో పూర్తి రివ్యూలో చూద్దాం.. లెనిన్ కథలోకి వెళితే.. 2001లో ఈ సినిమా సాగుతుంది. కర్నూలు కారాగారం నుండి అనుకున్న దానికంటే ముందస్తుగా విడుదలైన లెనిన్ అలియాస్ అఖిల్ అక్కినేని తన సొంతూరు శ్రీరామాపురంలోని ‘భరతమిట్ట’ చేరుకుంటాడు. వచ్చీ రాగానే తన పగ తీర్చుకునే పని మొదలుపెడతాడు. అసలు లెనిన్‌కు ఆ ఊరులో వాళ్లు చేసిన అన్యాయమేంటి..? తన సొంత వాళ్లే శత్రువులుగా ఎలా మారారు..? భారతంలోని పాత్రలకు తగ్గట్లుగా ఆ ఊళ్లో మనుషులు ఎలా ఉన్నారు..? తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతి అలియాస్ భాగ్యశ్రీ బోర్సే జీవితంలో జరిగిన ఘోరం ఏమిటి?! లెనిన్ జైలుపాలు కావడానికి కారణం ఎవరు? అతడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్లెవరు? వీటి చుట్టూ లెనిన్ కథ నడుస్తుంటుంది. లెనిన్ కు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు. కథలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పాత పల్లెటూరి పగలు, ప్రతీకారాల సినిమాలను చూస్తున్న భావన కలుగుతుంది. మహాభారతం నేపథ్యాన్ని కథకు ముడిపెట్టడం అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే హీరో అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడనే విషయంపై దర్శకుడు మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో హీరోపై వచ్చే ఒక కీలకమైన మలుపు, కాస్త అతకనట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్‌లో లాజిక్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ అద్భుతంగా పనిచేసింది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక అనవసరమైన అంశాలను పక్కన పెడితే, సినిమాలోని భావోద్వేగాలు నేరుగా హృదయానికి హత్తుకుంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు డైరెక్టర్ మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్‌కు ఉంది. ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూసిన అఖిల్ వేరు.. లెనిన్‌లో చూసిన అఖిల్ వేరు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అఖిల్. ఇప్పటిదాకా ఎవరూ ఊహించని రీతిలో లెనిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో తనలోని అసలైన నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు. భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథకు అవసరమైనంత బరువును తన భుజాలపై మోసింది. హీరోకు స్నేహితుడిగా, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో ప్రమోద్ పంజు అంచనాలకు మించి నటించాడు. తన పాత్రలోని వైవిధ్యమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక శివాజీకి ఒక బలమైన పాత్ర దక్కింది. బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీ రావు తదితరులు తమ తమ పరిధుల మేర చక్కని నటనను కనబరిచారు. థమన్ ఈ సినిమాకు మరో హీరో అనే చెప్పాలి. పాటల సంగతి ఎలా ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్‌లో వచ్చే ఆర్ఆర్ అదిరిపోయింది. సంగీతమే కాదు.. ఆర్ట్ వర్క్ కూడా లెనిన్ సినిమాకు మరో బలం. భారీ సెట్టింగ్స్ వేసి చిత్రీకరించినప్పటికీ, ఎక్కడా ఆర్టిపిషియల్‌గా కనిపించదు. చాలా సహజమైన వాతావరణాన్ని కెమెరామెన్ తన లెన్స్‌లో చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది.నాగార్జున, నాగవంశీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పేదేముంది. ఇక దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తను అనుకున్న కథను, తన మనసులోని ఆలోచనలను తెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. పైనల్‌గా ‘లెనిన్’ గురించి చెప్పాలంటే.. ఇదో విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. నేటి భారతం అని కూడా చెప్పొచ్చు!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us